మనోజ్ఞ
ఆ ప్రదేశాన్ని తనెప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు. తనెందుకు ఇక్కడికొచ్చిందో ఎలా వచ్చిందో కూడా తెలియడం లేదు. చుట్టూ పరికించి చూసింది. మెల్లగా రాజుకుంటూ ఏదో భయం... తనే వచ్చిందా లేక ఎవరైనా ఎత్తుకొచ్చారా? ఎటుచూసినా చట్టంగా పెరిగిన చెట్లు తప్ప మనుషులెవ్వరూ కన్పించలేదు. అడవిలా ఉంది. క్రూరమృగాలు కూడా ఉండొచ్చేమో.. ఆ ఆలోచనకే భయమేసింది. ఎట్లాగయినా సరే ఈ అడవిలోంచి బైటపడాలి. వేగంగా నడవసాగింది. దూరంనుంచి పులిగాండ్రింపు విన్పించింది. పరుగెత్తసాగింది. కట్టుకున్న చీర కాళ్ళకద్దంపడి కిందపడిపోయింది. పులి తన మీదకి దూకింది. దాని కోరల స్థానంలో అందమైన పలువరస.. విశాలమైన కనుదోయి.. వాటిలో నిప్పుకణికలా మండుతున్న క్రోధం.. పదునైన గోళ్ళతోతన గుండెల్ని చీలుస్తున్నట్టు ఆ నోట్లోంచి వస్తున్న అసహ్యమైన తిట్లు.. పులి కాదు.. పులిలాంటి అమ్మ..
భయంతో అరుస్తూ లేచికూచుంది మనోజ్ఞ. వొళ్ళంతా చెమటతో తడిచిపోయింది. పులికన్నా అమ్మను చూసినపుడే మరింత భయమేసింది. కిటికీలోంచి పల్చటి వెల్తురు. పడ్తోంది. ఎదురు గోడకున్న గడియారం వైపు చూసింది. సమయం ఆరున్నర.. పక్కనే పడుకుని మొబైల్ఫోన్లో వాట్సప్ మెసేజెస్ చూసుకుంటున్న అభిషేక్ వైపు చూసింది. తను కూడా ఆ గదిలో మంచం మీద అతని పక్కనే ఉందన్న స్పృహకూడా లేకుండా అతను మెసేజెస్ చూసుకోవడంలో, తిరిగి మెసేజెస్ ఇవ్వడంలో లీనమైఉన్నాడు.
"అభీ.. నువ్వు లేచి చాలా సేపయిందా? నన్ను లేపాల్సింది." ఆ రోజు అర్ధగంట ఆలస్యంగా లేచినందుకు కించిత్తు సిగ్గుపడ్తూ అంది.
ఎటువంటి సమాధానం రాకపోవడంతో, లేచి బాత్రూం వైపుకు నడుస్తున్నప్పుడు వెనకనుంచి అభి గొంతు విన్పించింది. "మళ్ళా పీడకల వచ్చినట్టుందిగా. నాకు చాలా ఆశ్చర్యమేస్తో ఉంటుంది తెలుసా? మానసిక జబ్బులకు వైద్యంచేసే సైకియాట్రిస్ట్లకి కూడా పీడకలలొస్తాయా?" అంటూ ఎగతాళిగా నవ్వాడు.
బాత్రూంలోకి దూరి, చల్లటి నీటితో మొహం కడుక్కుంది. గీజర్ వేసి, బ్రష్ చేసుకుని, కిచెన్లో వంటపనిలో నిమగ్నమైంది.
ఏ పని చేస్తున్నా అభి మాటలూ, ఎగతాళి నవ్వే గుర్తొస్తున్నాయి. ప్రేమించి కదా తను పెళ్ళి చేసుకుంది.. ప్రేమిస్తున్నాడని కదా నమ్మింది. ప్రేమ రాతిలో చెక్కిన అందమైన కవిత్వంలా శాశ్వతం కాదా.. మంచుతో మలిచిన శిల్పమా.. వయసు పెరిగేకొద్దీ ప్రేమ..................