సరిహద్దులు
అంత దూరం నుంచే గంట గణ గణలాడించుకుంటూ వస్తున్న కేశవుల్ని చూసి కేరింతలు కొడుతూ పిల్లలంతా "రిక్షా బ్బాయి, రిక్షాలబ్బాయి” అంటూ ఎదురొచ్చారు.
కాస్త పెద్ద పిల్లలు రిక్షా పూర్తిగా ఆగకముందే, చెంగుమని రిక్షాలోకి ఎగిరి సర్దుకుని కూర్చున్నారు. ఇంకాస్త చిన్న పిల్లలు కేశవులకి బాగ్స్ అందించి, మెల్లగా ఎక్కి బుద్ధిమంతుల్లా కూర్చుని కుతూహలంగా రోడ్డుని చూస్తున్నారు.
ఇంకా చిన్నారులు - మాటలు క్షుణ్ణంగా నేర్వకముందే చదువుల భారాన్ని మోస్తున్న బాధితులు - నిస్సహాయంగా తమ తల్లుల చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకుని, ఒకేసారి గొంతులు పెచ్చేశారు.
అతనికీ దృశ్యం మాములే. ఓపిగ్గా అందర్నీ పేరుపేరునా బుజ్జగించి, నవ్వించి, రిక్షాలో జాగ్రత్తగా కూర్చోబెట్టి తల్లుల అప్పగింతలకి భరోసానిస్తూ తలూపుతూ రిక్షా మెల్లగా పోనిచ్చాడు.
ఏలూరు రోడ్డు మీద పోతున్న రిక్షా చుట్టుగుంటవైపు తిరిగింది. విశాలాంధ్ర ఆఫీసు దాటాకా రిక్షాని ఆపాడు. వగర్చుకుంటూ పరిగెత్తుకొస్తున్న కొడుకుని చూసి ముద్దుగా బూతులు తిట్టుకుంటూ, రిక్షా ఆపి పావలా కాసు జేబులోంచి తీశాడు.
తండ్రి రిక్షాని, అందులోని పిల్లల్ని చూడడం రవికి మహా సరదా. చాలా రోజుల్నించి వాడినో కోరిక వేధిస్తోంది. ఈ మధ్య రోజూ అందుకు మారాం చేయడం మొదలుపెట్టాడు. “ఇంక లగెత్తరా ఇస్కూలికి టయమయిపోతోంది. అయ్యా రవీ! ఇక ఎల్లరా.” “నానా అడుగుతావా?” పరిగెత్తుతూ తండ్రిని తన కోరిక గురించి హెచ్చరించాడు. కేశవులు తలూపుతూ రిక్షా వేగం పెంచి ఏదో పాత సినిమా పాట అందుకున్నాడు.
బిలబిలమంటూ గేటులోంచి ప్రేయర్ హాల్ వైపు నడుస్తున్న పిల్లల్ని చూస్తూ నిలబడ్డాడు. ఎందుకో కొడుకు గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి. పితృ హృదయం స్పందించింది.
లేత నీలంరంగు డ్రెస్లో, ముదురు నీలంరంగు టై, బ్లాక్ బెల్ట్ పిల్లలు ఠీవిగా, ముచ్చటగా పావురాళ్ళలా చకచకా వెళ్ళిపోతున్నారు. ఈ స్కూల్ ప్రారంభించి రెండేళ్ళే అయినా చాలా త్వరగా మంచి గుర్తింపుని పొందింది. తను స్కూల్ రిక్షాబ్బాయిగా పెర్మనెంట్ గా జీతం తీసుకోవడంతో పాటు, తన భార్య లక్ష్మి కూడా స్కూల్ ఓనర్ గారింట్లో పాచిపని చేయడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది కేశవులికి. అందుకే ఆ స్కూలు, ఆ పిల్లలు, ఆ పరిసరాలు అన్నీ తన స్వంత ఆస్తిలా చాలా అభిమానంగా పరిశీలిస్తూ చూసుకుంటూ ఆనందిస్తూంటాడు.
వచ్చే సంవత్సరం అడ్మిషన్స్ కోసం ఈ మార్చి లోనే అప్లికేషన్స్ తీసుకోవడం మొదలైంది. ఆఫీసు రూం ముందు క్యూ ప్రారంభమైంది..................