మనుషుల్రా మనుషులు!
వస్తువులు కాదు, మనుషుల్రా మనుషులు.
కాపాడుకోవాల్సిన మనుషులు
మనసులు, మమతలున్న మనుషులు
కరిగిపోయే కన్నీటి మనుషులు
కదిలిపోయే చలనమున్న మనుషులు
అన్నం గురించి మాట్లాడుతున్నారు.
నేను గింజలగురించి ఆలోచిస్తున్నాను.
రుచుల గురించి చెబుతున్నారు.
శ్రమ, కష్టం, ఆకలి, కన్నీళ్లగురించి
నా ఆవేదన.
ఆస్తులు అంతస్తుల గురించి చెప్పుకుంటున్నప్పుడు
నిలవనీడలేని మనుషులు కళ్ళముందు కదలాడతారు.
వెలుగు గురించి మాట్లాడుతున్నప్పుడు
బతుకుల్లో నిండిన చీకటి
కళ్లెదుట నిలబడుతుంది.
స్వరం లేనివాళ్ళు, స్వేచ్ఛ అంటే తెలియనివాళ్ళు, చీమూ నెత్తురు
కలగలిసిన గాయంలాంటి వాళ్ళు, ఏ పురానాపూల్ మీదో, పేవ్ మెంట్ల
మీదో విరిగిన అరుగుల్లా మారినవాళ్ళు, బజారుల్లో విరిగిన వస్తువుల
మధ్య ఆకలిని అమ్ముకునేవాళ్లు, హోటళ్ల ముందు విదిల్చే అన్నం
మెతుకులకోసం పొట్టల్ని కళ్లుగా చేసుకుని కూచున్నవాళ్ళు, పడి
లేస్తున్నవాళ్లు, లేచి పడుతున్నవాళ్లు
మనుషులు, మనుషులు.......................