మరోచరిత
చెన్నై నుండి సికింద్రాబాద్ వచ్చే ఎక్స్ప్రెస్, గమ్యం చేరటానికి ఒక గంటముందే చరితకు మెలుకువ వచ్చింది.
రాత్రంతా పై బెర్తుమీద పడుకున్న మనిషి గురకతో మెలుకువ వస్తూనే ఉంది. గాలి ఆడటంలేదు. ఫ్యాన్ వేసుకుంటే ఎవరో తెలీకుండానే స్విచాఫ్ చేస్తున్నారు.
అసలే టెన్షన్గా ఉంది. జీవితంలో ఇల్లు వదలి మొదటిసారిగా హైదరాబాద్ నగరానికి ఒంటరిగా బయలుదేరిన చరిత హ్యాండ్ బ్యాగ్ని ఓసారి తడిమి చూసుకుంది. అన్నీ సరిగ్గానే ఉన్నాయి.
మామయ్య అడ్రస్ ప్రకారం వాళ్ళిల్లు చేరుకుంటే తనకి ఆయన సహాయం దొరకవచ్చు. ఆయన పెద్ద ఆఫీసర్ కదా! ప్రొసీజర్స్ అన్నీ తెలుస్తాయి.
రైలెక్కేముందు అమ్మ దిగులుమొహం గుర్తొచ్చి చరిత కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి. అమ్మ నిజంగా పిచ్చమ్మే! వద్దంటే స్టేషనొకొచ్చి రైలెక్కేదాకా, అది కదిలేదాకా నిలబడే ఉంది. కూతురు ఉద్యోగం కోసం అంత దూరం వెళ్ళటం ఆమెకు కష్టంగా ఉంది. కానీ పిల్లలందరిలో ప్రతిభావంతురాలయిన చరిత మెరిట్లో ప్రభుత్వోద్యోగం సంపాదించుకొని వెళ్తానంటే కాదనలేకపోయింది.
ఎక్కడో పల్లెటూర్లో పుట్టి టౌన్లో పెరిగిన చరిత ఒక మహా నగరంలోకి అడుగు పెట్టేముందు నాన్న చాలా జాగ్రత్తలు చెప్పారు...................