ఆన్లైన్ తరగతుల నుండి ఆటవిడుపు
కొవిడ్-19కి ప్రపంచం మొత్తం గట్టి కుదుపుకి లోనయింది. చాలామందికి ఉద్యోగాలు పోయాయి. ప్రయాణాలు ఇబ్బందిలో పడ్డాయి. విమానాలు నిలిచిపోయాయి. హోటళ్ళు, సినిమాహాళ్ళు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మూసివేసారు. ఈ కుదుపు ముఖ్యంగా బడికి వెళ్ళే పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపింది.
కిండర్ గార్డెన్ నుంచి పెద్ద తరగతుల వరకు అన్ని తరగతులు ఆన్లైన్ పాఠాలకు మారాయి. పిల్లలు పొద్దున్నే లేవడం, బడికి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళే యాతన తప్పినందుకు మొదట్లో చాలా ఉత్సాహపడ్డారు. కానీ నెమ్మదిగా ఆన్లైన్ తరగతులలోని ఇబ్బందులు అర్థమయ్యాయి. ఏకాగ్రత తగ్గడం, కంటిచూపు మీద వత్తిడి, తలనొప్పి, బయటకు వెళ్ళడానికి వీలులేకపోవడం వల్ల వారి చిరాకులు పెరిగాయి.
చాలామంది ఫోన్లలో కనబడే ఇతర ఆకర్షణలకు అలవాటు పడసాగారు. తల్లితండ్రులు ఆందోళన పడుతుంటే పిల్లలు అలసటకు గురికాసాగారు. నిజానికి బడి అంటే తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవడం, గ్రేడ్లు పొందడం మాత్రమే కాదు తోటి పిల్లలతో కలసి మెలసి మెలగడం ఇతరులను కలుసుకోవడం, తమ మనసులోని మాటలను స్వేచ్ఛగా చెప్పడం, అమాయకంగా రహస్యమంతనాలు జరపడం ఇంకా ఎన్నో ఉంటాయి.
నూనీ కూడా వీటికి మినహాయింపుకాదు. లాక్ డౌన్ సమయంలో నూనీకి పధ్నాలుగో ఏడు వచ్చింది.
లాక్ డౌన్ మొదటిరోజుల్లో ఇతర పిల్లల్లాగే నూనీ కూడా అమ్మా, నాన్నలు ఇంటి నుండే పని చేసుకోవడాన్ని ఆనందించింది. తనకు ఎప్పుడు ఏది కావాలంటే అది తినడం, తనకిష్టమైన 'షో'లన్నీ టి.వి. లో చూడటం చేసేది. కొత్తలో తన గది సర్దుకుంటూ, పుస్తకాలని అటుఇటు పేరుస్తూ కాలం గడిపేది. కానీ రోజులు గడిచేకొద్దీ విసుగెత్తి పోయింది. ఇంట్లో తాళం పెట్టి బంధించినట్టుండేసరికి మానసికంగా, దైహికంగా కూడా తేడా ఏర్పడింది...............