కొత్తకవిత ప్రభవిస్తున్న సందర్భం
-వాడ్రేవు చినవీరభద్రుడు,
2010 తర్వాత తెలుగు కవిత్వంలో వినిపిస్తున్న ఎన్నో ఆసక్తికరమైన శక్తిమంతమైన గళాల్లో మెర్సీ మనం విస్మరించలేని ఒక విశిష్ట గళం. ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా తెలుగు కవితాకాశాన్ని వెలిగిస్తున్న నూతన తారల్లో ఒక నవీనతార.
ఇప్పటి కవులకి ముఖ్యంగా ఈ యువతీయువకులకి అధ్యయనం మీద చాలానే ఆసక్తి ఉంది. గొప్ప కవిత్వాల్ని చదవాలనీ, ఎవరైనా చదివి వాటిలోని విశేషాల్ని విడమర్చి చెప్తే వినాలనీ, ఆ వినికిడి ద్వారా తమ వాక్కుని సానబెట్టుకోవాలనీ కోరిక. ఆ ఆసక్తితోనే ఆమె 'కవిత్వశాల' అనే ఒక గ్రూప్ ని కూడా ప్రారంభించారు. ఫేస్ బుక్లో నా కవిత్వం చదువుతూ, అప్పుడప్పుడు నన్ను ప్రశ్నలడుగుతూ, ఒకరోజు కవిత్వం మీద ఒక వర్క్ షాప్ నిర్వహించమని అడిగారామె నన్ను.
ఆ ఆలోచన సత్వరమే ఫలించి గత ఏడాది అక్టోబర్లో రవీంద్రభారతిలో కవిత్వమంటే ఏమిటనే ఒక అవగాహన సదస్సు నిర్వహించాం. ఆ సదస్సుకి సాహిత్య ప్రపంచంలో వచ్చిన స్పందన అపూర్వం. కొందరు మిత్రులు ఆ వర్క్ షాప్ నోట్సు వాడుకుని అమెరికాలో కూడా అవగాహనా సదస్సులు నిర్వహించారంటే, అందుకు మెర్సీ సంకల్పబలం, చిత్తశుద్ధి ప్రధానకారణాలని చెప్పాలి....................