గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతీ సంవత్సరం చివరిలో, ఆ సంవత్సరంలో నేను రాసిన వ్యాసాలి, ఒక సంపుటంగా తీసుకు వస్తున్నాము. ఈ సంపుటం కూడా అలాంటిదే.
ఈ వ్యాసాలన్నీ పత్రికల్లో వచ్చినవే. అయినా, పాఠకులు అందరూ, ఈ వ్యాసాలు వచ్చిన వేరు వేరు పత్రికల్ని చూసి వుండక పోవచ్చు. ఈ కారణం వల్ల కూడా, ఈ విషయాల మీద ఆసక్తి వున్న పాఠకులు కొత్త పుస్తకం ద్వారా అయినా కొత్త వ్యాసాలు చదువుతారని నేను ఆశిస్తాను. దీని వల్లే పత్రికలలో వచ్చిన వాటిని కూడా పుస్తకాలుగా ఏర్పర్చడం జరుగుతూ వుంది, గతం లోనూ, ఇప్పుడూ కూడా.
నాకు రాయాలనిపించిన విషయాల్ని - అవి సమకాలీన సంఘటనలైనా, మార్కు సిద్ధాంతానికి , సంబంధించినవైనా - వాటినే రాశాను. కొన్ని ముఖ్యమైన , విషయాల గురించి కూడా నేను రాసి వుండక పోవచ్చు. కాక సమకాలీన విషయాల మీద స్పందించాలంటే, 2 3 నిత్యమూ అనేక వందల సమస్యలకి స్పందించవలిసిందే.