చక్ర భ్రమణం
"ఓం తమీమహే మహాగయం స్వాహా!
ఇదమగ్నయే పవమానాయ ఇదం సమమ!!"
కామేశ్వర శర్మ ప్రధాన హోమమంత్రం వల్లిస్తుంటే అతని కొడుకు నారాయణశర్మ అదే మంత్రాన్ని వల్లె వేస్తున్నాడు.
ఇద్దరూ ఏటి ఒడ్డున ఉన్న పెద్ద చింతచెట్టుకింద కూర్చుని మంత్రాలను జపిస్తున్నారు.
అపరకర్మల మంత్రాలు ఊళ్ళోగానీ, గృహస్తులు వుండే ఇళ్ళల్లో గాని నేర్చుకోరాదన్న నియమం వల్ల కామేశ్వర శర్మ కొడుక్కి ఊరికి దూరంగా వున్న ఏటి ఒడ్డున చెట్టుకింద నేర్పుతున్నాడు.
కామేశ్వర శర్మ భగీరథ పురం అగ్రహారానికే కాక చుట్టుపక్కల వుండే నాలుగైదు అగ్రహారాల బ్రాహ్మణులకు అపరకర్మలు చేయించే పురోహితుడు. అతనికి ఈ పురోహితం తన తాత తండ్రుల దగ్గర్నుంచీ వారసత్వంగా వచ్చింది.
సాధారణంగా అగ్రహారాల్లోని బ్రాహ్మణులు అపరకర్మలు చేయించే పురోహితులచేత శుభకార్యాలైన ఒడుగులు, పెళ్ళిళ్ళు చేయించరు. వాటికి వేరే పురోహితులుంటారు. వీళ్ళచేత గాని పెళ్ళి వంటి శుభకార్యాలు చేయిస్తే గోవింద గోవింద అనే మంత్రం అలవాటులో పొరపాటున ఉచ్ఛరింపబడి ఆ శుభకార్యం అభాసుపాలౌతుందనీ అగ్రహారీకుల నమ్మకం.
ఆ పనస గంటసేపు ఆ చెట్టుకింద అలా కొనసాగింది. ఆ తరువాత తండ్రీ, కొడుకులిద్దరూ ఏటికి వెళ్ళి పంచెలు తడుపుకుని గాయత్రీ మంత్రం జపిస్తూ స్నానం చేసి ఇంటికి బయలుదేరారు..............