ఈ కథలు గతం కాదు.. చరిత్ర
తన జ్ఞాపకం గతం కాదంటుంది 'అంటరాని వసంతం'లో రూతు. సూఫీ కథలు గతం కాదు చరిత్ర. చరిత్ర అంటే వాస్తవం.
మట్టికి ఉన్నంత సుదీర్ఘమైన చరిత్రే మనిషిది కూడా. అలాంటి మట్టిని నడిచే అడుగుల కింద నుండి లాగేసుకుని పచ్చటి తంగేడువనం లాంటి పల్లెను నల్లటి బూడిద దిబ్బల్లా మార్చేసిన కథల కూర్పు ఈ "మెమోరీస్ ఆఫ్ మంగలిపల్లె". పల్లె అంటే నాలుగు గుడిసెల మధ్య విస్తీర్ణం కాదు. కలివిడిగా బతికే మనుషుల కలబోత. ఈ కథలన్నీ తొంబైల్లో సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల్లో కూరుకుపోయిన సజీవ సమూహాల గురించి, అభివృద్ధి పేరుతో జరిగిన మారణహోమానికి సజీవ సాక్ష్యంగా మిగిలిన మంగలిపల్లె మనుషుల గురించి, బొగ్గు గనుల సెగలో కుతకుతలాడి కాలిపోయిన తన ఊరి ఆనవాళ్లను తవ్వుకుంటూ పోయిన సూఫీకి దొరికిన శిథిలాల గురించి.
తెలంగాణలో పారే గోదారి పొడుగునా మనుషులున్నారు, వాళ్లకు ఒక భాష ఉంది, ఎన్నదగిన మాండలికం ఉంది. ఈ కథల్ని చెప్పడానికి సూఫీ తెలంగాణ భాషలో తన ప్రాంతంలో మాట్లాడే ప్రత్యేకమైన యాసను ఉపయోగించడం ఈ 'మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె' ప్రత్యేకత. మన భాష పుస్తకాల్లోకి ఎక్కాలి పుస్తకాలు మన భాషలో అచ్చు పడాలి అనే అభిలాష సూఫీ కథల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది.
సూఫీ రాసిన కథనం బహుజన తత్వం. ఒకప్పుడు తను బతికిన పల్లె అన్ని కులాలకి ఆదరువు. మంగలికి మాదిగకీ వరుసలు ఉన్న ఊరు బొగ్గు గనుల లోయలో........................