ఆత్మగౌరవ పోరాట ధిక్కార కథనాలు
"I measure the progress of a community by the degree of progress which woman have achieved."
- Dr. BR Ambedkar
చరిత్రలో స్త్రీల, అందునా బలహీనవర్గాల స్త్రీల, పాత్రను ఉద్దేశపూర్వకంగానే అగ్రవర్ణ చరిత్రకారులు నమోదు చేయలేదు. ఐతే సమాజంలో వస్తున్న అనేక సామాజిక, సంస్కరణోద్యమాల ఫలితంగా ఈ చరిత్రలను అణచివేతకు గురైన స్త్రీలే తిరగరాస్తున్నారు. దళితుల, మైనార్టీల, ఆదివాసీల జీవితాల పట్ల, వారి చరిత్రల పట్ల కనిపించే వివక్షను ఎత్తి పడుతూ సరికొత్త చరిత్రను వెలుగులోకి వీళ్ళు తెస్తున్నారు. ఈ కృషిలో అంబేడ్కర్ దార్శనికత మార్గదర్శిగా వీళ్లు చరిత్రకు కొత్త వాకిళ్లు తెరుస్తున్నారు.
కుల, మత, వర్గ, లింగ, పితృస్వామిక ఆధిపత్య అమానవీయ అణచివేత విధానాలని ఎదుర్కొని ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన స్త్రీల చరిత్రలో నమోదైనది కూడా మళ్లీ అగ్రవర్ణ స్త్రీల చరిత్రలే. ఈ మట్టిని తవ్వితే అడుగడుగునా కనిపించేది ఆదివాసులు, దళితులు, మైనార్టీ వర్గాల నెత్తుటి చరిత్రలే. ఆంగ్ల విద్య ప్రభావంతో అగ్రవర్ణాల సంస్కరణ ఉద్యమాలకి భిన్నంగా బ్రాహ్మణేతర సంస్కర్తల కృషికి కొనసాగింపుగా పోరాటాలు జరిగాయి. అది పరిమాణంలో ఎంత చిన్నదైనా, అది స్త్రీల ఆత్మగౌరవ పోరాట కథనాలు, ధిక్కార చరిత్రలు. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ సమాజ దాష్టీకాలని ఎదుర్కొంటూ సాగే నూతన తరానికి వీళ్ళు వేగుచుక్కలు.
1980వ దశకంలో వచ్చిన ఫెమినిస్ట్ ఉద్యమం కొన్ని కొత్త ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, అది కూడా ఉన్నత, మధ్యతరగతి వర్గాల సమస్యల వరకే పరిమితమయ్యింది....................