మిస్టర్ వి
O! what a tangled web we weave,
when first we practice to deceive.
- Sir Walter Scott
దూసుకుపోతున్న రైల్లో, బెర్త్ లో కూర్చుని ఉన్న అతను అందరిలా నిద్రపోవడం లేదు. అతనికి రైలు ఎప్పుడు రాజమండ్రి చేరుతుందా అని ఉంది. బయటంతా చీకటి. అక్కడక్కడ వెలుతురు పువ్వుల్లా, ఆశల దివ్వెల్లా వెలిగే మిణుగురు పురుగులు.
ఎండి బీటలు తీసిన నేలమీద తొలకరిజల్లు పడితే పుడమి తల్లి పులకరించినట్లుగా, తెల్లారితే అంతమయే సుదీర్ఘ నిరీక్షణని తలచుకుంటే అతని మనసు ఆనందపు జల్లులో తడుస్తోంది.
జేబులోంచి పోస్టల్ ముద్ర పడ్డ, ఓ కవరు తీసి, అందులోంచి ఓ కాగితం తీసాడు. అది అందిన వారం రోజులనించి అతను చదవడం ఎన్నోసారో ఆ కాగితానికే తెలీదు.
రాజమండ్రి
16.5.1990
ప్రియనేస్తం,
ఈ నెల 23వ తారీకున నాకు విముక్తి లభిస్తోంది. వచ్చేస్తున్నాను. ఇంకా వారం రోజులు. అమ్మో! వారమే! రోజుల్లో లెక్క వేస్తే ఏడే. గంటల్లో లెక్క వేస్తే.... ఒద్దు. ఒద్దు........