మిస్టర్ ఎక్స్
టాక్సీ జోరుగా వెళ్తుంది. ఉలెన్ సూట్ వేసుకున్నాను. అయినప్పటికీ బాగా చలి వేస్తోంది. కారు తలుపులకున్న అద్దాలను పైదాకా ఎత్తేశాను. అద్దాలగుండా రోడ్డుమీద పచార్లు చేస్తున్న ప్రజల్నీ, విశాలంగా, ఇంపుగా కట్టబడ్డ ఇళ్ళనీ చూస్తూ కూర్చున్నాను.
ఈస్టెండ్ హోటల్ ముందు టాక్సీ ఆగింది. యూనిఫామ్లో ఉన్న హోటల్ నౌఖరు తలుపు తెరిచాడు. కిందకి దిగి, మీటర్వైపు ఓసారి చూసి, అయిదు రూపాయల నోటు. టాక్సీ వాడికిచ్చాను. వుడ్బైన్ సిగరెట్ వెలిగించి, ఉషారుగా హోటల్ ముందర హాల్లోకి నడిచాను. నా వెనకనే హోటల్ నౌఖరు సామాన్లతో హాజరయ్యాడు.
కౌంటర్ ముందుకు వెళ్లి, నిలబడ్డాను. అనేకమంది గదులకోసం కాబోలు కాచు క్కూర్చున్నారు. కౌంటర్ వెనుక నిలబడ్డ గుమాస్తాకి నన్ను పరిచయం చేసుకుని, ట్రంక్ ఫోన్లో చెప్పిన ప్రకారం నాకోసం ఓ గది రిజర్వు చేయబడిందా అని అడిగాను.
"క్షమించండి. మీరు ఆలస్యంగా ట్రంక్ కాల్ చేశారు. అయినప్పటికీ ఓ గది మీకు గంటలోగా ఇస్తాం.".
"ఈ గంటసేపు నన్ను ఏం చేయమంటారు? మీ కేసి చూస్తూ, కౌంటర్ ముందు నిలబడనా?" అన్నాను కొంచెం కోపంగా.
గుమాస్తా క్షణం ఆలోచించి, వెనక్కి తిరిగి, తాళం చెవులు తగిలించి ఉన్న బోర్డు వైపు చూశాడు.
"మూడో అంతస్తులో ఓ గది ఉందండి. నెంబర్ 215. ఇప్పుడే ఖాళీ అయింది. గదినింకా మేము శుభ్రపరచలేదు. కాని మీకు అభ్యంతరం లేకపోతే అందులో ప్రవేశించండి." అంటూ గుమాస్తా ఒక తాళంచెవిని నాకు అందించాడు. అది తీసుకుని, వడివడిగా లిఫ్గదివైపు పరుగెత్తాను. మూడో అంతస్తురాగానే లిఫ్ట్లోంచి దిగాను. వరండామీద నడిచి, 215 నెంబరు గది తలుపు తెరిచి, లోపలకు వెళ్లాను.
గది చాలా విశాలంగా ఉంది. ఒక చిన్న బాత్రూమ్ పక్కనే ఉంది. హోటల్ నౌఖరు సామాన్లు గదిలో పెట్టి, 'బకీస్!' అన్నట్లు నావైపు చూసి, పళ్ళు ఇకిలించాడు. బకీస్ ఇచ్చే సూచనలు నాలో లేవని గుర్తించి, అతను వెర్రి మొహంతో వెళ్లిపోయాడు.................