గుర్తుకొచ్చిన బాధ్యత
నరేంద్ర ఆరో తరగతి, రాధ నాల్గవ తరగతి. వారిద్దరూ ఒకే బడిలో చదువుతున్నారు. వారు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరితే గాని బడికి చేరుకోలేరు.
ఒకరోజు ఎనిమిది గంటలైనా అమ్మ వంట ప్రారంభించలేదు. అసహనంతో నరేంద్ర చెల్లెలితో అన్నాడు. " అన్నం అయ్యేదెప్పుడు, తినేదెప్పుడు, అంత దూరంలో వుండే బడికి పోయేదెప్పుడు? ఆలస్యంగా పోతే డ్రిల్ మాస్టర్ మనల్ని బయట నిలబెడతాడు. అమ్మకు ఎన్నిసార్లు చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు" అని గట్టిగా చెప్పాడు చెల్లెలితో.
అమ్మ వింటున్నదే గానీ ఏమీ సమాధానం చెప్పలేదు. చెల్లెలు కూడా విని, నవ్వి వూరుకుంది. చెల్లెలికి కారణం తెలుసు, ఇంట్లో వంటకు కావలసిన వస్తువులు ఏవీ లేవని. అందుకే ఆమె గానీ, అమ్మ గానీ జవాబివ్వలేదు.
నెమ్మదిగా అంది "అన్నా! ఈమధ్య నాన్నగారు వ్యసనాలకు బానిసై కూలికి సరిగ్గా వెళ్లలేదు. అమ్మకు కూడా పని దొరకలేదు. అంతకుముందు అమ్మకు పని దొరక్కపోతే నాన్నే ఎవరినైనా అడిగి పని పురమాయించేవాడు. ఇప్పుడు ఆ విధంగాలేదు. వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎడమొహం, పెడమొహంగా ఉంటారు" అని ఏడుస్తూ చెప్పింది రాధ అన్నతో.
“అమ్మా, నాన్నలు మాట్లాడుకోవడంలేదని నీకెలా తెలుసు? నాకు ఎప్పుడూ చెప్పలేదే!" అన్నాడు. నరేంద్ర.
"అన్నా! అవి చెప్పే విషయాలు కాదు. నీకు ఇంటి విషయాలు తెలియవు. నీవు ఇంటివద్ద వుంటేకదా. తెలియడానికి. ఎప్పుడూ స్నేహితులతో కలసి ఆడుకోవడానికి పోతుంటావు" అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రాధ.
"అన్నా! నేను బాగా చదువుకొని టీచరునై, డబ్బు సంపాదించి, మన పూరిల్లు తీసివేసి మంచి ఇల్లు కట్టించుకోవాలి. వాన వస్తే సందు లేకుండా నీళ్లు కారుతాయి. ఆ నీళ్లు అమ్మ, ఎత్తిపోస్తుంటే నాకు ఏడుపొస్తుంది" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది రాధ.
"నాకూ అలాగే అనిపిస్తుంది. అమ్మ చినిగిన జాకెట్టు, నాన్న చినిగిన చొక్కా చూసి, పంచె కూడా మాసిపోయి ఉంటుంది. వారిని చూసి, నేను బడి మానేసి కూలికి పోదామనిపిస్తుంది" అని చెల్లెలితో చెప్పి ఏడుపు ముఖం పెట్టాడు...............