ఎవరికి ఎవరు గురువు?
నా దగ్గర చదువుకున్న విద్యార్థిని చూడగానే ఎక్కడినుంచో ప్రేమ ఉబుకరావటమే కాదు, ఆ విద్యార్థికి 50 ఏండ్ల వయసు వచ్చినా ఆ విద్యార్థి శరీరం తాకి దగ్గరకు తీసుకుంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. ఎందుకు? అని నాకునేను ప్రశ్న వేసుకుంటున్నాను. పసిపిల్లవాడు చిన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తాడు. ఎన్నో తుంటరి పనులు చేస్తాడు. కానీ అవి ఏవీ జ్ఞప్తికి రావు. ఆ విద్యార్థి శరీరం తాకగానే ఆ స్పర్శ రెండు ఆత్మల జ్ఞాన సంయోగం లాగా అనిపిస్తుంది. విద్యార్థి వలన గురువుకూ ఒక సద్గుణమచ్చింది. ప్రతివారు తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పులను క్షమించే తత్వం ఉ పాధ్యాయునికొస్తుంది. దాని వలన ఉపాధ్యాయునికి జీవితంలో ఇతరులు మంచిని చూసే అవకాశము వస్తుంది. ఇది తరగతి గది ఇచ్చిన గొప్ప కానుక. నేను చిన్నప్పుడు ఎన్నో తుంటరి పనులు చేశాను కదా. ఎంత మంది క్షమిస్తే నేను 90 ఏళ్ల వాణ్ణయ్యాను. ఆ తరంలో ఉండే మహానీయులు నన్ను ప్రతి గడియలో క్షమించి నన్ను తీర్చిదిద్దారు. దాని వలనే నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. నా చిన్న తప్పును వారు గోరంతలు కొండంతలు చేయలేదు.
క్షమించిన వారు గొప్పవారు. అదే గురువును గౌరవ ప్రధానమైన మనిషిగా రూపొందిస్తుంది.
విద్యార్థి తన తప్పును మరిచిపోడు. గురువును చూడగానే తన చిన్నతనం. తను చేసిన పోకిరి లక్షణాలు జ్ఞప్తికి వచ్చి పాదాక్రాంతుడవుతాడు. ఉపాధ్యాయునికి అనేవి జ్ఞప్తికి ఉండవు. విద్యార్థి తరగతిగదిలో చెప్పిన చురుకైన సమాధానాలే జ్ఞప్తికొస్తాయి. అందుకే విద్యార్థి తలపై ఉపాధ్యాయుడు చేయి పెడతాడు. ముద్దించుకుంటాడు. ఇవాళ 30 ఏళ్ల మనిషి ఓ 50 ఏళ్ల మనిషిని ముద్దించుకుంటుంటే వాకింగ్లో అందరూ ఆశ్యర్యంగా చూస్తున్నారు. నాకు సిగ్గే అనిపించలేదు. నా క్యారెక్టరును కూడా ఆ విద్యార్థి రూపొందించాడు. ప్రతి శిష్యుడూ ఉపాధ్యాయుని గురువే. ఇద్దరూ నేర్చుకుంటారు. ఒకరు భవిష్యత్కు తయారు చేస్తే, రెండోవారు వర్తమానానికి తయారు చేస్తారు. శిష్యుడు పాత్ర ఉపాధ్యాయుని నిర్మాణంలో ప్రధానమైంది......................