జార్జి డ్యూ రోయ్ రెస్టారెంటులో తన దగ్గరున్న అయిదు ఫ్రాంకులు నాణేన్ని మార్చి బైటికి వచ్చాడు. మిలటరీ స్టైల్లో మీసం మెలిపెట్టేడు. రెస్టారెంటులో సేల్స్ ఆడవాళ్ళు ముగ్గురు, జా సంగీతం టీచరు (వయసెంతో తెలీదు), మరో ఇద్దరు ఆడవాళ్ళు, వాళ్ల భర్తలు భోజనం చేస్తున్నారు. అతను వాళ్ళవేపు ఓ చూపు విసిరేడు.
పేవ్మెంటు దగ్గరకి వచ్చాక ఆగేడు. ఎటు వెళ్ళాలి? ఆ వేళ జూన్ 28వ తారీకు. ఆ నెల గడవడానికి అతని దగ్గర వున్నవి మూడు ఫ్రాంకులు. మధ్యాహ్నం భోజనాలు రెండు మానేస్తే, రెండు రాత్రి భోజనాలు లేదా రెండు రాత్రి భోజనాలు మానేస్తే, రెండు మధ్యాహ్నం భోజనాలు. అదీ అతని పరిస్థితి. అలా ఆలోచిస్తూనే అతను ర్యూ నోటర్మ్ డి లోరెట్టి వేపు నడిచాడు. వీధిలో జనాన్ని మొరటుగా తోసేస్తూ, దారి చేసుకుంటూ నడిచాడు.
అతను పొడుగ్గా వుంటాడు.
నడిచే దృఢంగా వుంటాడు.
నీలికళ్ళు, రింగులు తిరిగిన మీసం
ప్రముఖ రొమాంటిక్ హీరోలా వుంటాడు.
జార్జి డ్యూరో వెడల్పుగా వున్న రోడ్డు దగ్గరికి వచ్చి మళ్లీ ఆగాడు. చివరికి మెడలేన్ రోడ్డువేపు తిరిగి జనంలో కలిసిపోయాడు.
పెద్ద పెద్ద హోటళ్ళు అతన్ని హేళన చేస్తున్నాయి. కాని ఆ సాయంత్రం కేవలం రెండు గ్లాసులు బీరు తాగితే? ఏవుంది! ఆ మర్నాడు భోజనానికి స్వస్తి! "అయినా చాలా దాహంగా వుంది. మరింక 'అమెరికైన్' దగ్గర ఓ గ్లాసు తీసుకోవాలి అనుకున్నాడు.............