కాశీపట్నం చూడర బాబూ..
చిన్నప్పుడు జాతరకెళితే, ఏడ్చి గోల చేసాయినాసరే, మూడు వస్తువులు కొనేవాణ్ణి.
రంగుల కళ్లద్దాలు: చూస్తే మనుషులంతా రంగు పూసుకుని కనిపించేవాళ్లు.
పిల్లంగోవి: నోట్లో పెట్టుకుని స్టీమ్ ఇంజిన్ కూతపెడుతూ, చెవులతుప్పు వదలగొడుతుంటే భరించలేక జనం కకావికలైపోయేవాళ్లు.
మూడోది... పిక్చర్బక్స్: ప్లాస్టిక్ బాక్స్కి భూతద్దముండేది. ఇందులో ఫిల్మ్ ముక్కలు పెడితే ఎన్టీయార్, ఏఎన్నార్ కళ్లముందు నిలబడేవారు. పిక్చర్ బాక్స్కి పెద్దన్నయ్య బయోస్కోప్. ఒక బక్క చిక్కిన ముసలాయన, చిరుగుల అంగీతో ఈ పెద్ద పెట్టెను మోసుకొచ్చేవాడు. రాయదుర్గం జెండామాను కింద ఆయన దిగాడంటే పిల్లలందరూ పరుగో పరుగు. ఈ పెట్టెపైన రెండు ఆడ, మగ బొమ్మలు చేతితో తాళాలు పట్టుకొని ఉండేవి. వాటిని కదిలిస్తూ 'కాశీపట్నం చూడర బాబూ' అని బలహీనమైన గొంతుతో ముసలాయన అరిచేవాడు.
బయోస్కోప్ రెండు కళ్లలోకి ఏకకాలంలో ఇద్దరు తొంగిచూడొచ్చు. బొంబాయి పట్నం, సముద్రంలో స్టీమర్, కలకత్తాలో కార్లు, బస్సులు ఇలా తొమ్మిది బొమ్మలు చూపించి 'రాణి రంగమ్మగారు' అంటూ ఓ బూతు బొమ్మ చూపేవాడు. దాని చూడ్డమా, మానడమా అనే సంకోచంతో కిచకిచమని నవ్వుతూ పిల్లలంతా తలలు బయటకి పెట్టేవాళ్లం. మేమిచ్చే పది పైసలు చాలకనో, ఆకలి ఎక్కువయ్యో ఈ ముసలాయన ఒకరోజు చచ్చిపోయాడు. ఊరి బయటున్న గుడిసెముందు శవం. ఏడ్వడానికి ముసలి భార్య తప్ప ఇంకెవరూ లేరు. శవపేటికలా కనిపించింది........................