ముద్ర
దేవులపల్లి కృష్ణమూర్తి సాహిత్యరంగంలోకి సృజనాత్మక రచయితగా కాస్త ఆలస్యంగానే ప్రవేశించాడు. అయితే ఆయన రచనలు చేయడానికి ముందు అనేకమంది సాహిత్యకారులతో స్నేహం చేశాడు. అనేక సాహిత్య సంస్థలతో సన్నిహితమైన సంబంధం యేర్పరచుకున్నాడు. తహసిల్దార్ ఉద్యోగవిరమణ చేసిన తర్వాతనే ఆయన సాహిత్య పరిశీలకుడి నుండి సాహిత్య సృజనకారుడుగా యెదిగిపోయి, ఎన్నో కథలు, నవలలు, యాత్రారచనలు సృష్టించటం మొదలెట్టాడు.
కృష్ణమూర్తితో నాకు యాబైసంవత్సరాల స్నేహం ఉంది. నేను 1964 లో నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా చేరినప్పట్నించి నేనో రచయితనని తెలుసుకొని కృష్ణమూర్తి నన్ను వెతుక్కుంటూ వచ్చి నాతో స్నేహం చెయ్యటం ప్రారంభించాడు. ఆ స్నేహం ఆ నాటినుండి ఈనాటి వరకు చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతోంది. ఆయన లేఖినినుండి వెలువడుతున్న రచనల్లో చాలావాటిని నేను చదువుతూనే ఉన్నాను. వాటిని గురించి ఆయనతో చర్చించటం జరుగుతూనే ఉంది. కృష్ణమూర్తి లేఖిని నుండి ఇప్పటివరకు ఆరు రచనలు వెలువడ్డాయి. వాటిలో రెండు నవలలు, మూడు కథానికసంకలనాలు, ఒక యాత్రా రచనలు ఉన్నాయి. చాలా సరళమైన తెలంగాణభాషలో రచనలు చెయ్యడం ఆయనకు చాలా చక్కగా అలవడింది. సరళమైన తెలంగాణభాష అని ఎందుకంటున్నానంటే, కొందరు తెలంగాణ రచయితలు తెలంగాణభాష పేరుతో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మాత్రమే మాట్లాడే కొన్ని మరుగుపడిపోయిన మాటల్ని వాడుతూ, చాలా కఠినతరమైన భాషతో పాఠకులకు హాయిగా చదువుకోవటంలో ఇబ్బందిని కల్గిస్తున్నారు. కానీ కృష్ణమూర్తి వాడే తెలంగాణ భాష చాలా సరళంగా, సమకాలీనంగా ఉండటం వల్ల ఆయనభాషలో చక్కని ధార ఉంటుంది. ఈ కారణంచేతనే ఆయన రచనల్లో మంచి పఠనీయతాగుణం ఉంటుంది..........................