నేరము - శిక్ష
ఉమాకాంతనాథ్ పచారు చేస్తున్నాడు. మేడ పై అంతస్తులో! అతని హృదయంలో అగ్ని గోళము పెఠిల్లుమని బ్రద్దలవటానికి ఆయత్తమవుతున్నది. మనిషి అంతర్గతంగా తీరని వ్యధతో సతమతమవుతున్నాడు.
బాధతో ఆతని ముహం కమిలిపోయింది. అడుగులు బరువుగా పడుతున్నాయి. కూర్చోలేడు; అలా అని నిల్చోనూ లేదు. మనసులోని బాధ అత న్నేమిచేయటానికి అంగీకరించడం లేదు.
పశ్చిమాద్రిన సూర్యభగవానుడు, తన వేడి వాడి కిరణాలతో అస్తమించ నుద్యుక్తు డవుతున్నాడు. విరామ మెరుగని ఆతని ప్రయాణంవల్ల, ఆతని ముఖం జేవురించుకు పోయింది. బద్ధకంగా మాతృగర్భంలోకి జొరపడుతున్నాడు.
జస్టిస్ ఉమాకాంతునకు అచేతన, అనిశ్చిత పరిస్థితి యేర్పడింది, అది హృదయాన్ని పిండివేస్తున్నది. మనస్సును చింపి వేస్తున్నది. హృదయం విప్పి, కనీసం ఆత్మీయులతో చెప్పుకునే విషయం గాదది. అయినా ఆతనిమనో వేదన సహనంతో వినే ఆత్మీయుడు, హృదయతాపాన్ని చల్లార్చగల ఆప్తుడూ ఎవరూ అతనికి లేరంటే నమ్మాల్సిన విషయమే. గానీ, ఆశ్చర్యపడాల్సిన విషయమేం గాదు. అతని హెూదాను, అతనిపలుకుబడిని, గౌరవించే వారున్నా రేమోగానీ, అతనిలోని ఉమానాథుడనే సామాన్య వ్యక్తిని, తోటి వ్యక్తిగా గౌరవించి.. ఆదరించి, అప్యాయంగా పలుకరించేవాడు ఈ ప్రపంచంలో ఈ ప్రస్తుతంలేరు.
అతనిలోని బాధంతా నిట్టూర్పుల రూపంలో బయటకు వస్తున్నది. అతని సున్నిత హృదయం, తీరని వ్యధకు తాళ లేక బాధగా ఆక్రోశిస్తున్నది.
ఉమాకాంత్కు తలనొప్పి అధికం కాజొచ్చింది. మస్తిష్కానికి గ్లాని సంభ వించింది. సర్వస్వం పోయినవాడిలా, తెలియని బాధతో చీకాకు పడుతున్నాడు.
చల్లగాలికి ఊగులాడుతున్న, డోర్ కర్టెను తొలగించుకు నౌకరు వినయంగా గదిలోకి యజమాని సమక్షంలోకి ప్రవేశించాడు. యజమాని తను రావటం గమనించలేదన్న నిర్ధారణ చేసుకున్న తరువాత "బాబు గారూ... టీ తెమ్మంటారా?..." అనన్నాడు..................