ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కర్మ చేస్తాడు. ప్రతిజీవి కర్మ చెయ్యదా? అనే అనుమానం రావచ్చు. అలా జరగదు. ప్రతిజీవి కర్మ చెయ్యదు. ఈ జగత్తులో 84 లక్షల రకాలైన జీవరాసి ఉన్నది. ఇవి భూచరాలు, ఖేచరాలు, జలచరాలు ఉభయచరాలు అని విభజించబడ్డాయి. వీటిలో అన్నింటికీ అవయవాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని జీవులకు (పశువులు) కాళ్ళు మాత్రమే ఉంటాయి. చేతులుండవు. కొన్నింటికి కాళ్ళు చేతులు కూడా ఉండవు. (చేపలు) కొన్ని జీవులు నాలుగు కాళ్ళు మాత్రమే ఉన్నా, వాటిలో ముందు కాళ్ళను చేతులుగా కూడా ఉపయోగిస్తాయి. (కోతులు) కన్ను, ముక్కు, చెవి, నాలుక వంటి అవయవాలు సామాన్యగా అన్ని జీవులకు ఉంటాయి. కొన్ని జీవులకు (పాములు) చెవులు ఉండవు. కొన్ని జీవులు పగలు మాత్రమే చూడగలుగుతాయి. (మానవులు) మరి కొన్ని రాత్రులందు మాత్రమే చూడగలుగుతాయి. వాటినే దివాంధములు (గుడ్లగూబలు) అంటారు. శరీరంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు అని పదకొండు ఇంద్రియాలున్నాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కొన్ని లోపాలతో అన్ని జీవులకు ఉంటాయి. కాని మనసు అనేది కేవలము మానవుడికి మాత్రమే ఉన్న వరం. కాబట్టే మానవుడు యుక్తాయుక్త విచక్షణా జ్ఞానము కలిగి ఉంటాడు. ఆలోచనాశక్తి ఉంటుంది. ఈ కారణాల చేతనే కర్మలు చెయ్యగలుగుతున్నాడు.
కర్మ చేసినట్లైతే దానికి ప్రతిఫలము తప్పక ఉంటుంది. మనం కర్మ గనక చేసినట్లైతే దాని ఫలితాన్ని తప్పక అనుభవించాలి. కర్మలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. చెడు కర్మలు చేస్తే పాపం వస్తుంది. ఈ రకంగా మానవుడు తను చేసే కర్మలవల్లనే పాపపుణ్యాలు మూట కట్టుకుంటాడు. వీటిలో కొన్నింటి ఫలితాలు ఇప్పుడే ఈ జన్మలోనే అనుభవిస్తే, మరి కొన్నింటిని తరువాత జన్మలలో అనుభవిస్తాడు.
డా|| క్రోవి పార్థసారథి