మూడోసారి వెలువడ్తున్న “ముళ్ళపొదలు”
'ముళ్ళపొదలు' నవలను నేను నా ప్రథమ నవల 'అంపశయ్య'కు రెండో భాగంగా (సీక్వెల్గా) 1976లో రాశాను.
'అంపశయ్య'లో ముఖ్యపాత్రలందరూ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులు.
వాళ్ళు డిగ్రీలు చేతపుచ్చుకొని విశ్వవిద్యాలయాల్లోంచి వాస్తవ ప్రపంచంలో కొచ్చాక వాళ్ళు ఎదుర్కొనే సమస్యల్లో అత్యంత ప్రభావవంతమైనది: నిరుద్యోగం. తల్లిదండ్రులు ఎన్నో అవస్తలు పడి అప్పులు చేసి, ఎన్నో ఆశలతో పంపించిన డబ్బుతో విశ్వవిద్యాలయాల్లోని హాస్టల్స్లో హాయిగా, ఒకరకమైన విలాసవంతమైన జీవితమే గడిపిన యువకులకు నిరుద్యోగులుగా బతకటం నరకప్రాయమే అవుతుంది. కోరుకున్న ఉద్యోగం దొరకటం లేదన్న దిగులుతో (ఫ్రస్టేషన్) వాళ్ళు రకరకాల ఉద్యమాల వైపు ఆకర్షితులవుతుంటారు. అలా ఈ నవలలోని ఐదుగురు యువకులు వాళ్ళ భావి జీవితంలో యేం కాబోతున్నారో కూడా ఈ నవలలో చిత్రించాను. 'ముళ్ళపొదలు' తర్వాత నేను దీనికి సీక్వెల్గా రాసిన మూడో నవల 'అంతస్రవంతి'. ముళ్ళపొదల్లో నిరుద్యోగులుగా ఉన్న యువకులు ఉద్యోగస్తులై, వివాహితులయ్యాక వాళ్ళ జీవితాలెలా ఉంటాయో 'అంతస్రవంతి'లో చూపించాను.
ఒక నవలకు సీక్వెల్గా మరో రెండు నవలల్ని రచించటం తెలుగు నవలా సాహిత్యంలో చాలా అరుదుగానే జరుగుతుంటుంది. ఈ తరహా సృష్టిని సినిమారంగంలో సత్యజిత్ ప్రవేశపెట్టారు.
బిబుతీభూషన్ బెనర్జీ రచించిన నవల పథేర్పాంచాలి (సాంగ్ ఆఫ్ ది రోడ్) ఆధారంగా సత్యజిత్ మూడు సినిమాల్ని నిర్మించాడు. అవి: 'పథేర్పించాలి',.................