ముత్తయ్య భాగవతార్ కృతి మణిమాల
హరికేశ నల్లూర్ ముత్తయ్య భాగవతార్ సంగ్రహ జీవితం (1877-1945)
సంగీత త్రిమూర్తుల తర్వాత 20వ శతాబ్దపు వాగ్గేయకారులలో ఎన్నదగిన ప్రధముడు శ్రీ హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్. సాంప్రదాయక కర్ణాటక సంగీతాన్ని, సాహిత్యాన్ని పరిపష్టంచేసి 'భక్తి' మార్గంలో విస్తృతపరచి, సొగసైన ఆధునికతను మేళవించిన అసమాన ప్రతిభాశాలి. రాజువలె జీవితాన్ని గడిపి, ఔదార్యంలో కూడా రాజనిపించుకున్న మహనీయుడు. 'హరికేశ' వాగ్గేయకారముద్రతో సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తన విద్వత్తుతో విరివిగా రచనలు చేసిన సుప్రసిద్ధ 'వాగ్గేయకారుడు'.
ముత్తయ్య భాగవతార్ 1877 సం॥ నవంబర్ 15వ తేదీన (ఈశ్వర నామ సంవత్సరం, సౌర కార్తీక శుద్ధ విదియ) తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోగల 'హరికేశ 'నల్లూర్' అనే చిన్నగ్రామంలో జన్మించారు. ఆరవయేటనే తండ్రి మరణించడంతో మేనమామ 'లక్ష్మణసూరి' ప్రాపకంలో పెరిగాడు. వారి ఆధ్వర్యంలోనే 'ముత్తు గణపతిగళ్' అనే గురువు వద్ద సంస్కృతం, వేదాధ్యయనంలో ప్రవేశించారు. చిన్నవయసులో ఉన్న భాగవతార్ సంగీతంపై గల మక్కువ, మమకారంతో శాస్త్రాధ్యయనాలు విడిచిపెట్టి 'తిరువయ్యార్' చేరుకున్నారు. అప్పటికే 'తిరువయ్యార్ 'లో మహావైద్యనాధ అయ్యర్, 'పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్' వంటి సంగీత విద్వాంసులు కర్ణాటక సంగీతాన్ని మారుమ్రోగిస్తున్నారు. వారి
ప్రభావంతో సంగీతంలో జ్ఞానం సంపాదించాలని సంకల్పించి గురువుకై వెతుక్కున్నారు. భగవదనుగ్రహం, వారి అదృష్టం వల్ల త్యాగరాజ శిష్యపరంపరలో ఒకరైన 'సాంబశివ అయ్యర్', భాగవతార్లోగల సంగీతపిపాస గుర్తించి చేరదీశారు. గురువుగారి శిష్యరికంలో సాంప్రదాయక కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. నిరంతర సాధన, అధ్యయనంతో గాఢశుద్ధిని, గాంధర్వసిద్ధిని కూడా పొందారు.
భాగవతార్ తన సంగీతవిద్య ముగించుకుని 1893లో తిరిగి హరికేశనల్లూరికి చేరుకున్నారు. ఆకర్షణీయమైన రూపం, తేజోవంతమైన విగ్రహం, అపురూప గాత్ర గాంభీర్యం కలబోసిన భాగవతార్ అచిరకాలంలోనే గాయకునిగా, సంగీత విద్వాంసునిగా పేరు పొందారు. మొదట హరికథా భాగవతార్ గా తన స్పష్టమైన, గంభీరమైన కంఠానికి చక్కని సహజ హాస్య చతురత, సమయస్ఫూర్తిని జోడించి వల్లీ పరిణయం, త్యాగరాజ చరితం, సతీసులోచన వంటి కధా కాలక్షేపాలతో బహుళ జనాదరణ పొందారు.
భాగవతార్ జీవితంలో 1897 సం|| అతి ముఖ్యమైనది. తిరువాస్కూర్ మహారాజు 'మూలం తిరునాళ్' రాజాస్థానాన్ని సందర్శించి తన సంగీతవిద్యను ప్రదర్శించారు. దానికి ముగ్ధులైన రాజావారు స్వర్ణకంకణాలు, శాలువాతో సత్కరించారు. రాజాస్థానంలో లభించిన రాజగౌరవం, గుర్తింపు వీరిని ఎంతో ఉత్తేజపరచి సంగీతవిద్యలో నిష్ణాతులు అవటానికి ఎంతగానో దోహదపడింది.
1902 సం||లో భాగవతార్ 'మదురై' చేరి అక్కడే కొన్ని సంవత్సరాలు నివసించారు. ఆకాలంలోనే వారు అనేకానేక రచనలు చేసి, స్వరపరచి తనను తాను నిరూపించుకున్నారు. 1920లో 'త్యాగరాయ సంగీత విద్యాలయం' పేరుతో.............