అధ్యాయం 1
నా జీవిత చరిత్ర గురించి రాయాలంటే భయంగా ఉంది. నా బాల్యాన్ని చుట్టుముట్టిన బంగారపు మేలిముసుగును తొలగించాలంటే కొంచెం జంకుగా ఉంది. అసలు జీవిత చరిత్ర రాయడమే ఒక కష్టమైన పని. బాగా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తించి వాటిని విడదీసి రాయాలనుకొన్నప్పుడు అప్పటినుండి ఇప్పటి వరకు నిజంగా జరిగిన సంఘటనలు కొన్ని నా ఊహాగానాలతో అల్లుకుపోయినట్లు అనిపిస్తోంది. అయితే, కల్పన అనేది లేకుండా ఏ స్త్రీ తన బాల్యానుభావాల్నివివరించగలదు? నా జీవితం మొదటి రెండు మూడు సంవత్సరాల గురించిన జ్ఞాపకాలు చాల స్పష్టం కళ్ళముందుకు వస్తున్నాయి కానీ మరికొన్ని కనీకనిపించని నీడలుగా అయిపోయాయి. అంతే కాదు, చిన్నప్పుడు అనుభవించిన ఆనందాలకి, దుఃఖాలకి, అప్పుడు ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు ఉండదు కదా. నా చిన్నప్పటి చదువు గురించిన వివరాలు కొన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. తరువాతి కాలంలో జరిగిన గొప్ప ఘటనల ముందు అవి పాలి పోయాయి. అందుకే, ఈ కథలో నేను బాగా ఇష్టపడిన, నాకు ముఖ్యం అనిపించిన కొన్ని సంఘటనల గురించి మాత్రమే రాసాను.
నేను 1880వ సంవత్సరం జూన్ నెల 27వ తేదీన అలబామా రాష్ట్రానికి ఉత్తర దిశలో ఉన్న తస్కంబియా అనే చిన్న పట్నంలో పుట్టాను. మా నాన్నగారి పూర్వీకులు స్విట్జర్లాండ్కి చెందిన కాస్పెర్ కెల్లర్ వంశానికి చెందిన వారు, అమెరికా తూర్పు రాష్ట్రమైన మేరీల్యాండ్ వచ్చి స్థిరపడ్డారు. వారిలో ఒకాయన జ్యూరిక్లో బధిర పిల్లలకి పాఠాలు చెప్పారట, వారి చదువు గురించి ఒక పుస్తకం కూడా రాశారట! మా తాత, అంటే కాన్పెర్ కెల్లర్ కొడుకు అలబామాలో ఎకరాలకి ఎకరాల భూములు కొని అక్కడే స్థిరపడ్డారట. అయన ప్రతిసంవత్సరం ఒక రోజు గుర్రం మీద సవారీ చేస్తూ తస్కంబియా నుండీ ఫిలడెల్ఫియా వరకు వెళ్లి, తన పొలాలకు, తోటలకు కావాల్సిన సామాగ్రిని కొని తెచుకొనేవారట. ఆ ప్రయాణాలగురించి అయన తన కుటుంబ సభ్యులకు రాసిన ఉత్తరాలు కొన్ని మా అత్త దాచి పెట్టారు. మా నానమ్మ కెల్లర్ లఫాయేట్కి చెందిన అలెగ్జాండర్ మూర్ కూతురు, ఒకప్పుడు వర్జీనియా గవర్నర్ అయిన...........