చిన్న ఎలుగుబంటి
(URSA MINOR)
(లఘు ఋక్షము)
స్కాండినేవియన్ దేవతలు విశ్వాన్ని బ్రహ్మాండమైన బంతిలాగ మలిచి, యుద్ధంలో ఓడిన రాక్షసులను ఈ గోళం మీద వేరువేరు ప్రదేశాలలో మేకులతో తాపడం చేశారు. పెద్ద శూలాన్ని విశ్వగోళం గుండా గుచ్చుతూ, విశ్వానికి సరిగ్గా మధ్యలో ఉన్న భూమి గుండా దూర్చి, ఆ మహాగోళపు అవతలి అంచు దాకా శూలాన్ని తోసి, అది కదిలిపోకుండా ఒక వజ్రాన్ని బిగించారు. ఆ వజ్రమే ధ్రువతార (Polaris). పందిని శూలానికి గుచ్చి తిప్పుతూ నిప్పుల మీద కాల్చేటప్పుడు పంది కూడా తిరుగుతున్నట్లే. విశ్వగోళపు మధ్యలో శూలానికి బిగించిన భూమి కూడా తిరుగుతూ ఉంటుంది. అన్ని నక్షత్రాలూ గిరగిరా తిరుగుతూ ఉంటే ఒక్క ధ్రువతార మాత్రమే కదలకుండా స్థిరంగా ఉండడానికి కారణాన్ని స్కాండినేవియనులు ఈ విధంగా వివరించారు.
విశ్వగోళం మీద వివిధ స్థానాలలో అతికించిన నక్షత్రాలన్నీ విశ్వకేంద్రంలో ఉన్న భూమి చుట్టూ నిరంతరం గిరగిరా తిరుగుతూ ఉంటాయి. ధ్రువతారకు ఎంతదూరంలో ఉంటే నక్షత్రాలు అంత పెద్ద వృత్తాలు చుడతాయి.
చిన్న ఎలుగుబంటి లేక లఘు ఋక్షము అనబడే నక్షత్రరాశిలో ఏడు చుక్కలు ఉన్నాయి. దాని తోకలోని చిట్టచివరదే ధ్రువతార. దీనికి కొంచెం దూరంలో 'పెద్ద ఎలుగుబంటి ఉంది. ఈ రెండు ఎలుగులూ ఎదురు బొదురుగా - అంటే ఒకదాని తోక మరొక దాని ముఖం వైపుగా ఉంటాయి. ఈ రెండు ఎలుగుబంట్లనీ Dragon అనబడే పెద్ద రాక్షసిపాము యొక్క చుట్టలలోని ఒక చుట్ట విడదీస్తోంది.
చిన్న ఎలుగుబంటి చుక్కలు ఏమంత ప్రకాశవంతంగా ఉండవు. దీని తోక చివర ధ్రువతార ఉండడం వల్లనే ఈ అల్పనక్షత్ర రాశికి ప్రాధాన్యం వచ్చింది. ఫొనీషియన్ల నౌకాయాన రహస్యం:
పొలారిస్ ఉత్తర ఆకాశంలో స్థిరంగా ఉంటుంది కనుక దీనిని సముద్రాల మీద నౌకాయాలకు ఉపయోగించవచ్చునని మొట్ట మొదట గ్రహించిన వారు ఫొనీషియన్లు...............