ఆదిపర్వం - ప్రథమాశ్వాసము
శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖార్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్రేయసే.
తాత్పర్యం : ఏ బ్రహ్మ, విష్ణు శంకరులు చిరకాలం నుండి రొమ్ములో, ముఖంలో, శరీరంలో లక్ష్మి, సరస్వతి, పార్వతులను ధరిస్తున్న వారై, స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని విడిపోకుండా చేస్తున్నారో, మూడు వేదాల రూపధారులై దేవతలచేత పూజించబడుతున్నారో అలాంటి బ్రహ్మ, విష్ణు, శంకరులు మీకు శ్రేయస్సును కలిగింతురు గాక!
రాజకులైకభూషణుఁడు, రాజమనోహరుఁ డన్యరాజతే
జోజయశాలిశౌర్యుఁడు, విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్.
తాత్పర్యం : చంద్ర వంశానికి ముఖ్యమైన అలంకారమైనవాడు, చంద్రుని లాగా అందమైనవాడు, శత్రురాజుల పరాక్రమాల్ని జయించటం చేత ప్రకాశిస్తున్న శౌర్యం కలవాడు, సమస్తలోకాలలో నిర్మలమైన కీర్తి అనే వెన్నెలతో ప్రకాశిస్తున్న శరత్కాల చంద్రుని లాంటివాడు, ఓటమి ఎఱుగనివాడు, భుజమునందలి కత్తి పదును అనే నీటిచేత అణచివేయబడిన శత్రువులనే ధూళి కలవాడు అయిన రాజరాజ నరేంద్రుడు ఔన్నత్యంతో ప్రకాశిస్తున్నాడు......