'నన్ను చూసి ఏడవకురా...'
హైదరాబాదులో ఆటోల వెనుక, లారీల వెనుక కనబడే నినాదం - నన్ను చూసి ఏడవకురా..? చాలామంది 'నను చూసి ఎడ్వకురా' అని రాయిస్తూ వుంటారు. అది చదివి నాకు నవ్వు వస్తూంటుంది. 'నిన్ను చూసి కాదు, నీ తెలుగు చూసి ఏడుస్తున్నానురా బాబూ' అని చెప్పాలనిపిస్తుంది. నిజానికి ఆ ఆటో లేదా లారీ డ్రైవర్ని చూసే అవకాశం, అవసరం మనకు ఉండదు. ఇలా రాయించారు కాబట్టి ఓసారి మొహం చూడగానే ఏడుపు వస్తుందేమో పరీక్షించి చూద్దామనిపిస్తుంది.
మొహం కాదు, అతని ఆర్థిక స్థితిగతులు చూసి మనం ఏడుస్తున్నామని అనుకుంటున్నాడా? భుక్తి కోసం ఆటో లేదా లారీ నడిపేవాణ్ని చూసి అనూయ పడే వాళ్లు జనాభాలో ఎంత శాతం ఉంటారంటారు? ఆ బండేదో నడిపి తాము చాలా ఉన్నత స్థానానికి చేరిపోయామని, తమను చూసి తక్కుంగల జనాలంతా కుళ్లి ఛస్తున్నారనీ వాళ్ల భావనా!? నా అనుమానం - అది వాళ్లను ఉద్దేశించిన నినాదం కాదు. మనందరి మనసుల్లో అనుకునే మాటను లారీ లేదా ఆటో యజమాని అక్కడ రాయించి వుంటాడు.
మనం తమాషా మనుషులం. లోకంలో మనంత దురదృష్టవంతులం లేరని సణుగుతూ వుంటాం. దేవుడు మనమీద అన్యాయంగా పగ బట్టి యీ ప్రాంతంలో, యీ మతంలో, యీ కులంలో, యీ యింట్లో పుట్టించాడని, ప్రతిభకు తగ్గ అవకాశం, శ్రమకు తగ్గ ఫలితం యివ్వటం లేదని, మన మంచితనాన్ని లోకం కాదు కదా కుటుంబసభ్యులు సైతం గుర్తించటం లేదని ఎప్పుడూ ఏడుస్తూంటాం. అదే సమయంలో చుట్టుపక్క వాళ్లందరూ మనను చూసి ఏడుస్తున్నారనీ ఫీలవుతాం. రెండు ఎలా పొసుగుతాయి? పక్కవాళ్లు కుళ్లుకుని చచ్చేటంత గొప్పగా వున్నామని సంతోషించి, తృప్తి పడి, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పవచ్చు. లేదా లోకంలో అత్యంత హీనస్థితిలో ఉన్నామనీ, మనల్ని చూసి ఈర్ష్య వడేవాడెవడూ లేడు అనుకుని నిశ్చింతగా బతకవచ్చు. రెండూ చేయం.
ఓకే, వాడెవడో మన కంటె అధమ స్థితిలో వున్నాడు కాబట్టి అసూయపడ్డాడు అనుకుని వాడి మీద జాలిపడవచ్చుగా! అబ్బే, అలా................