నారాయణభట్టు
ఆనాడు రాజమహేంద్రపురము మహాకోలాహలముగా నుండెను. విద్యార్థులకు ఆటవిడుపు. సామాన్యోద్యోగులకు సెలవు. క్రీడాకారులకు తమ నేర్పు ప్రదర్శించుటకు సమయము. ఈ క్రీడావినోదము లీ విధముగా వారము దినములు నడచును. ఇప్పటి కైదు సంవత్సరముల క్రిందట రాజ రాజనరేంద్రుడు నిజప్రతాపముచే వేంగీ రాజ్యముమీద దండెత్తి వచ్చిన కర్ణాటక సైన్యములను పారదోలెను. మరియు నప్పుడే కర్ణాటకుల మిత్రమై వచ్చిన తన సవతి సోదరుడగు విజయాదిత్యుని కేవలవాత్సల్యముచే తన వశ మొనర్చుకొనెను. ఈ విజయద్వంద్వజ్ఞాపకార్థము ఏ టేట నిట్టి ఉత్సవములు చైత్ర శుద్ధ దశమినుండి జరుగుచుండెను. ఈ విజయనామ సంవత్సర నిజచైత్రమాసమున మరింత వైభవముతో జరుపుట కాయత్త పరచిరి.
ఈ ఉత్సవములు తిలకించుటకు వేంగీరాజ్యము నాలుగుమూలల నుండియే కాక ఇతర భోగములనుండియు రాజపుత్రులును, వీరులును, సంపన్నులును విచ్చేసిరి, వారి విడుదలకై రాజమహేంద్రపురములోని మందిరములు చాలక పురము వెలుపల ధవళగిరి వరకు ననేక పటకుటీరములు నిర్మించిరి. సమర్థులగు శిల్పులా భాగమును రమ్యముగను వాస యోగ్యముగను కల్పించిరి.
చుట్టుప్రక్కల జనపదములనుండి నగరమునకు మూగిన జనసమూహము అసంఖ్యాకముగా నున్నది. ఆ పట్టణములో రథగజాశ్వాదులు స్వేచ్ఛగా విహరించు విశాలమైన రాజమార్గమే, ఈనాడు జనులతో క్రిక్కిరిసి యందు మనుష్యులు నడచుటగూడ కష్టసాధ్యముగా నున్నది.
కాని ఎట్లో ఒకచోట నవకాశము చేసికొని ఇంద్రజాలికు డొకడు తన విద్యా మహిమ చూపుచుండెను. అతడప్పుడే ఒక మామిడి టెంక నాటి వెంటనే మొక్క నారాయణభట్టు.......................