ఉపోద్ఘాతం
అభివృద్ధి పథంలో దూసుకపోతుందనుకుంటున్న ఆధునిక సమాజం ప్రకృతి సమతుల్యతకు తూట్లు పొడుస్తూ, పెట్రేగిన ఆర్ధిక అత్యాశతో, నిత్య రక్త ప్రవాహక్షేత్రాలకు, కుల మత వర్ణ వర్గ వివక్షా మృత్యుభేల కోలాహల విషాదాల స్థలిగా, అంతుబట్టని విధ్వంసక మూలాల హేలగా, ఆధునిక వైరస్ ధ్వంస రచనా ప్రాభవంతో అతలాకుతలమై దర్శనమిస్తుంది. ఆధునిక ధ్వంస రచల్ని విధ్వంసంచేస్తూ వినూత్న ప్రకృతి నిర్మాణ రచన నారంభించాలి. మనిషిని మనిషి ప్రేమించగల, మనిషిని మనిషిగా ప్రేమించగల, మనిషితనాన్ని ఆరవోసే మానవహిత ప్రేమామృత మహేతి హాసాన్ని నిర్మించాలి. కుల వ్యవస్థ, ఫ్యాక్షనిజం, తదితర సామాజిక జాఢ్యాల కాల కూటాన్ని నింపుకున్న వ్యవస్థాగత అమానవీయ చరితని చెరిపేసి, మానవీయతా కావ్యానికి సరికొత్త ముఖచిత్రాన్ని గీయాలి. సమాజంలో శ్రమజీవి, దుష్కృత జీవి దాష్టికానికి, దౌర్జన్యానికి దోపిడీకి బలికాకుండా చైతన్యవంతమైన వినూత్న విశ్లేషణతో సాహిత్య ధార ఉవ్వెత్తున ఉప్పొంగి ప్రవహించాలి. సమసమాజపు సాంగత్యంలో ఎటువంటి వివక్షకు తావు లేకుండా అందరి హృదయాలు హర్షించి ప్రేమమయమై వర్షించినప్పుడే మానవత్వ పరిమళాలు అంతట వెదజల్లబడతాయి. మదోన్మత్త, సంక్షుబ్ధ ఘోష వినిపించని మధుర మనోహర భావహేలలు బలోపేతమౌతాయి.
ఆధునిక అట్టడుగువర్గాల్ని ఆదుకునే సాహితీవేత్తలు, స్వప్నశక్తి సార్వభూమాధికారాన్ని వినిర్గతం చేస్తూ, అంతర్భూతమైవున్న భయంకరమైన అణచివేత వాస్తవ దృశ్యాల్ని లభించుకున్న హృదయాంతరంగాన్ని వడగట్టిన సారాన్ని అక్షరాల్లోకి ఒంపుకుంటూ పోతుంటారు. భయ, విభ్రమాల మధ్య విషాదవాక్యంవలె సాగే జీవితంలో సామాన్యుల దర్శించలేని ఎన్నో కోణాల్ని,.....................