జ్ఞానభద్రతలో
నోటి సాహిత్యం - రాత సాహిత్యం
ప్రపంచంలో అనేక ప్రాంతాలలో జ్ఞానమైనా సాహిత్యమైనా రెండు పద్ధతుల్లో పరివ్యాప్తి పొందింది. ఒకటి నోళ్లద్వారా, రెండోది రాతలద్వారా. శబ్దించిన భాషా సాంకేతికాలు రూపధారణ చేయడానికి ఎంతోకాలం పడుతుంది. మాటపుట్టాకే రాత.
భారతీయ జ్ఞాన ప్రవాహాలు ప్రజలకు చేరడంలో మౌఖిక లేఖన సంప్ర దాయాలు రెండూ తగిన పాత్ర సమాంతర ప్రయాణాలతో వహించాయి.
క్రీ.శ. 3వ శతాబ్ది నుండి భారతదేశంలో రాత ప్రతులున్నట్లు తెలుస్తోంది. వేరువేరు పత్రాలు చెదురుమదురుగా ఉంటే గ్రంథం అనకూడదు. అనం కూడా. వాటికి గ్రంథి అంటే ముడివేసి ఒక దరికి చేరిస్తేనే గ్రంథం అవుతోంది. తాటాకులపై, భూర్జర పత్రాలపై గ్రంథాలు కొనసాగాయి. అంతకుమునుపు మౌఖికరూపాలే.
భారతదేశంలో వేదాలను తక్కినవాటిని ఆనాటి బ్రాహ్మణులు మౌఖికంగా పరంపరగా రక్షిస్తూ రావడం అభినందనీయమని వివేకానందుడి వంటివారే ఉద్ఘాటించారు.
అయితే కొన్ని వర్గాలు మౌఖికంగా భద్రపరచినవి వెలికి వచ్చాయి. పేర్కొన బడ్డాయి. కానీ ఎన్నో సామాన్య వర్గాలు, అట్టడుగున ఉండి తమతమ సంస్కృతుల్ని రక్షించుకున్న వారిని మనం గణించవలసినంతగా గణించలేదు. వైదిక విద్యా వంతులు వేదాలను కంఠస్థం చేసి శతాబ్దాల నుండి రక్షించినట్లుగా జానపద గేయా లను కంఠస్థం చేసి ఒకరి నుండి మరొకరు రక్షించుకుంటూ రావడం అసామాన్య అంశం. ఏ వర్గాలలోనైనా ధారణలు ఆశ్చర్యకరాలే, కొండరావి బెరడు పలకల కట్టల పై కూడా జ్ఞానభద్రతకు కృషి చేశారంటే ఆశ్చర్యమే తెలంగాణాలో కావ్యాలే శిలలపై చెక్కి భద్రపరిచారంటే వారి జ్ఞానప్రసార తపన అచ్చు వచ్చిన కాలంలో మనకుందా అనిపిస్తుంది..................