భానుడుదయించే పద్మములు వికసిల్లె పక్షులన్ని కిలకిల పొట్టకూటికై పరుగిడె. ఉదయం అయిదు గంటల సమయం కావొస్తోంది. పచ్చికపల్లె గ్రామములోని అన్ని మతాల ప్రార్థనా మందిరాలలో వారివారి మేలుకొలుపు గీతాలు వినిపిస్తున్నాయి.
అప్పుడే ఆవుపేడతో కల్లాపి చల్లి ముగ్గువేస్తున్న సంయుక్తతో "అమ్మా!” అని పిలుస్తూ పడక కుర్చీలో కూర్చున్నారు శంకరం మాస్టారు. "నాన్నా స్నానం చేసిరండి" అని తండ్రికి చెపుతూ ముగ్గు వేయడం పూర్తిచేసి లోనికి వెళ్ళి స్నానం పూర్తిచేసి వచ్చి; మాస్టారి ముందు మొలకెత్తిన గింజలు, పండ్ల రసం పెట్టింది.
మొక్కలకు నీరు పెడుతున్న సంయుక్తను చూస్తూ సంయుక్తకు తన భార్య శారద అలవాట్లే వచ్చాయి. శారద ఎంతో ప్రేమతో జామచెట్టు, ఉసిరిచెట్టు, కరివేపాకు చెట్లు వేసింది. అంతేకాక చూడగానే మనసును ఉల్లసింపచేసే పూలమొక్కలు గులాబి, జాజి, మల్లెలు, తులసి, చేమంతి, మందార పూల చెట్లు వేసి, ఎన్నో పూలను పండ్లను పండించేది. క్యాన్సర్ వ్యాధితో తనుపోయాక మొక్కల ఆలనాపాలనా సంయుక్త చూస్తోంది. సంయుక్తకు కూడా మొక్కలు అంటే ఎంతో శ్రద్ధ అనుకుంటుండగా "నాన్నగారూ! ఇంకా మీముందు పెట్టిన ఫలహారం తినలేదు, వీటిలో ఎన్నో పోషక విలువలు, ఖనిజ లవణాలు వున్నాయి. ఈ వయస్సులో మీకు శరీరానికి కావలసిన శక్తినిస్తాయి” అంటున్న కూతురువైపు నవ్వుతూ తృప్తిగా చూశారు శంకరం మాస్టారు.
అప్పుడే పక్కింటి జానకి వచ్చింది. శారద వున్నప్పుడు జానకి పిన్నీ పిన్నీ అంటూ కలవరిస్తూ తను ఇంట్లో చేసిన పిండివంటలు తెచ్చి ఇచ్చేది. శారద కూడా తాను చేసిన ప్రతి వంట జానకికి రుచి చూపించేది. వాళ్ళిద్దరిది మంచి స్నేహం అనుకుంటూ.... "రామ్మా.. రా కూర్చో” అంటూ కుర్చీ చూపించారు మాస్టారు. “ఏం లేదు బాబాయిగారు,........................