నీటి ముత్యాలు
కోర్టు రూము బయట ఉన్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ పలికింది కోర్టు ప్యూను గొంతు. కోర్టు హాలులో కూర్చున్న భానుతేజ ఒక్కసారి ఉలిక్కిపడి చూశాడు.
అవతల పంచలో బారులు తీరి అతి వినయంగా, ఆదుర్దాగా, నిశ్శబ్దంగా తమ పేరు ఎప్పుడు పిలుస్తారోనని ఆతృతగా చూస్తున్న జనంవైపు తిరిగి చూసిన భాను పక్కనున్న వేణువైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
జవాబుగా వేణు నవ్వేసి పక్క లాయరుతో మాట్లాడుతున్నాడు. భానుతేజ ఎదురు కుర్చీల వైపు చూశాడు. అందరూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు.
ఓహెూ, అయితే ఈ హెచ్చరిక కోర్టు బయట వేచి కూర్చుని తమ భాగ్యదేవతను నిశ్శబ్దంగా పరీక్షించుకుంటున్న వాది ప్రతివాదులకుగానీ తమకు కాదని గ్రహించినవాడై జారుతున్న నల్లగౌనును సర్దుకుని కూర్చున్నాడు.
ఇంతలో పక్కగా ఆఫీసు గుమాస్తా కన్పించి ఏదో కేసు చెప్పాడు. ఆ అంకెల హడావిడి అతడికర్థం కాలేదు. తన ముందున్న డాకెట్ను గాభరాగా పరిశీలించుకుంటుండగా... “టైమ్ అడగండి... టైమ్ అడగండి" వెనుకనుండి చేత్తో పొడిచాడు గుమాస్తా.
కంగారుగా లేచాడు భానుతేజ. అసలే పైనున్న నల్లకోటు బరువుగా కొత్తగా ఉంది. పైన వేసుకున్న సిల్కుగౌను భుజాలమీద అతడికి చికాకు కల్గిస్తోంది. అందుకే, ఏం చెప్పాలో తెలియక, అస్పష్టంగా “టైమ్... టైమ్...” అంటుండగా పక్కనున్న వేణు కల్పించుకుని, “టైమ్ ఈజ్ ప్రేయ్డ్ ఫర్... టైమ్ ఈజ్ ప్రేయ్డ్ ఫర్" అంటూ ఇంచుమించు ప్రాగ్జోంగ్ లాంటిది ఇచ్చాడు.
వణుకుతున్న కాళ్ళు నిలబడనని మొరాయిస్తుంటే తడబడుతున్న గొంతు తడారిపోతుంటే తను ఏమంటున్నాడో తనకే తెలియని స్థితిలో ఏదో అన్నాడు. కోర్టులో అందరూ ఘోల్లుమన్న తర్వాత గానీ తను "ప్రేయ్డ్ ఈజ్ టైమ్" అన్నట్లుగా గ్రహించలేదతడు.
అది గ్రహించాక అతడి ముఖం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది. చప్పున కూలబడ్డాడు కుర్చీలో...............