మొక్కైవంగనిది మానై వంగునా? అన్నది సామెత. చిన్నప్పటి నుండే పిల్లల్లో వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటుంది. మంచి గుణాలైనా, చెడు గుణాలైనాఅలవడేది చిన్నతనంలోనే. మానసిక వికాసం కలిగే దశలో పిల్లల్ని మంచి గుణ గణాలతో తీర్చిదిద్దుకోవాలి.
అందుకు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. పిల్లల్లో సంస్కారం, సత్ప్రవర్తన, విచక్షణ, క్రమశిక్షణ, నిజాయితీ లాంటి సద్గుణాలతో పెంచగలిగితేనే ఉత్తములుగా ఎదుగుతారు.
అందుకు దోహదపడే బాల సాహిత్యం కథల రూపంలో, గేయ రూపంలో, పద్యరూపంలో మనకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా వేమన, సుమతి, దాశరథి, భాస్కర, చౌడప్ప, గువ్వల చెన్న శతకాలు ప్రబోధాత్మకంగా పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహద పడతాయి.
ఈ పుస్తకంలో నన్నయ, వేమన, బద్దెన, చౌడప్ప, చిన్నయసూరి లాంటి ప్రాచీన కవులతో పాటు జాషువా, కరుణశ్రీ, దువ్వూరి రామిరెడ్డి, ఏటుకూరి వెంకటనరసయ్య, తుమ్మల సీతారామమూర్తి, నాళం కృష్ణారావు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, గరికపాటి నరసింహారావు మొ|| ఆధునిక కవులు రాసిన సరళమైన నీతి పద్యాలను ఏర్చికూర్చి సులభంగా అర్ధమయ్యేలా, పిల్లలకు అందించారు కవి పండితులు డా|| రామడుగు వేంకటేశ్వరశర్మ.
తప్పక పెద్దలు పిల్లలచేత చదివించవలసిన
నీతి పద్య మాలిక.