ఒకటి
కథ చెప్పేముందు ఆ పద్ధతికి ఓ పేరు పెట్టాలి. అలాంటి నిబంధన గనుక ఉంటే దానికి "గుల్మెహర్” అనే పేరు పెడదాము. మిత్రమా, నీకు తెలుసో లేదో ఆమె పేరు మాత్రం గులె మొహర్ కాదు. అదే పేరుతో ఓ కథ రాసింది.
"అవును. గుల్ దుపహరియా” పేరుతో కూడా రాసింది.
* 'గుల్' అనే పేరు బాగా నచ్చినట్లుంది. అదే నిర్ణయించుకుంది.”
"నీ మాట నిజమే! గుల్మహర్ పేరు సరిగ్గా సరిపోతుంది. బాగా ఎండా కాలంలో కూడా ఎండనుంచి పారిపోయేది కాదు. చిన్నవయసునుంచే మొహం వాడిపోకూడదని తప్పనిసరిగా గొడుగు వేసుకుని నడిచేది. సగటు భారతీయ అమ్మాయిలా నల్లనిపిల్ల అన్పించుకోకూడదనీ, ఎర్రటిపిల్ల అన్పించుకోవాలనుకునేది.
విశిష్ట వ్యక్తిగా తయారుకావాలనుకున్న వ్యక్తి గడ్డిపోచగా మారక తప్పని స్థితి కూడా రావొచ్చు. ఏమో. ఎవరు చెప్పగలరు. ఆమె చాలా పోగొట్టుకుంది కానీ గొడుగుని మాత్రం కాదు. దీన్నిబట్టి ఆమె జీవితాన్నుంచి కూడా తననితాను కాపాడు కుందని మాత్రం అంచనా వేయకూడదు. జీవితాన్ని తుఫాన్లనుంచి కాపాడుకోవటం వేరే విషయం. నా లెక్క ప్రకారం భయంతో పారిపోయే బదులు తీవ్రమైన ఆపదల్ని హక్కుగా భావించిందెవరంటే 'గులెహర్' అనే జవాబు చెప్తాను. ఆకర్షించే తళుకు బెళుకులతోబాటు నిరంతర ప్రవాహంలా ఒకే దిశలో సాగిపోయిన తీరు ఆమెది.
మొహం రంగునుంచి అలంకరించుకునే చేతులదాకా అందం గురించి అంతే శ్రద్ధ తీసుకునేది. ఆ అమ్మాయి చేతులు చాలా అందంగా ఉండేవని చెల్లెలు మోగ్రా చెప్తుండేది. చలాకీగా గలగలా మాట్లాడేది 'గుల్మొహర్' ఐతే బిడియంగా ముక్తసరిగా ఉండేది మోగ్రా.
ఒకసారేం జరిగిందంటే... “వద్దులే! ఇకపై ఆ కథ మోగ్రా చెప్తుంది. మోగ్రా నువ్వయితేనే బాగా చెప్పగలవు.. చెప్పు.”
"అది నిజమే! మేం జీవితమంతా కలసి బతికాం కదా!”
“అబద్ధంతో మొదలెట్టకు. కలసి ఎక్కడ జీవించారు? మీ ఇద్దరి పెళ్ళిళ్ళు వేరు వేరు యువకులతో జరిగాయికదా! పెళ్ళిళ్ళు అయినాక కలిసి లేరుగా?”..............