కోటీర నగరం కోలాహలంగా ఉంది. ఉగాది పర్వంతో ప్రారంభమయ్యే వసంత నవరాత్రుల సందర్భంలో అనునిత్యమూ ఆ నగరం కోలాహలంగానే ఉంటుంది. పదవనాడు వసంత నవరాత్రుల సమాపనోత్సవ దినం. అది నగరవాసులకు మహాపర్వం.
శరన్నవరాత్రుల పదవనాడు 'విజయదశమి' అయితే, వసంత నవరాత్రుల పదవనాడు సుభిక్ష సామ్రాజ్యానికి 'వీరదశమి'. శతాబ్దాల క్రితం సుభిక్ష సామ్రాజ్య చక్రవర్తి రూపొందించి, ప్రారంభించిన పర్వం అది. తొమ్మిది దినాలపాటు రాజ్యంలోని యువ యోధుల మధ్య యుద్ధ విద్యలలో స్పర్ధలు జరుగుతాయి. ఖడ్గ యుద్ధం, గదా యుద్ధం, ముష్టి యుద్ధం అనే ప్రధాన విద్యలలో జరిగే పోటీలలో వందలాది మంది పాల్గొంటారు. వీరదశమి అయిన పదవనాటికి మూడు ప్రక్రియలలోనూ విజేతలుగా ఇద్దరు యోధులు మిగులుతారు. ఖడ్గ యుద్ధంలో, గదా యుద్ధంలో, ముష్టి యుద్ధంలో ఆ ఇద్దరి మధ్య స్పర్ధ జరుగుతుంది. మూడింటిలోనూ గెలిచిన యోధుడు మహావీర విజేత. విజేతకు జ్ఞాపికలుగా స్వర్ణ ఖడ్గమూ, స్వర్ణగదా లభిస్తాయి. ఆకారంలో చిన్నవైనప్పటికీ విలువలో ఆ రెండూ చాలాపెద్దవే! ఆ జ్ఞాపికలకు తోడుగా పట్టువస్త్రాలు, బంగారు నాణేలు, నవరత్నాలు పొదిగిన 'వీర హారం', ముఖ్యంగా మహారాజుగారి ప్రాపకం లభిస్తాయి.
నగరవాసులందరూ రాజమందిరం ముందున్న క్రీడాంగణంలో గుమిగూడారు. చిన్నా, పెద్దా, బీదా, బిక్కీ, ఆడా, మగా అందరూ నిర్దేశిత స్థలాల్లో కూర్చున్నారు. క్రీడాంగణానికి పడమటివైపు ఉన్నత ప్రదేశంమీద ఉన్న చలువరాతి మండపంలో మహారాజు నంది కేశ్వరుడూ, మహారాణి శుభాంగీ కూర్చున్నారు. ఇద్దరి మధ్యా రాకుమారి ఉత్పల, రాజ కుటుంబానికి ఇరువైపులా మహామంత్రి, రాజగురువు, ఆస్థాన జ్యోతిష్కుడూ, ఇతర రాజోద్యోగులూ కూర్చున్నారు. గడచిన తొమ్మిదినాళ్ళ స్పర్ధలలో పాల్గొని, పరాజితులైపోయిన వందమందికి పైగా యవకులు ఒక వైపున వరుసగా కూర్చున్నారు.
క్రిక్కిరిసి కూర్చున్న ప్రేక్షకులు వీరదశమినాడు యుద్ధ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించబోయే యోధుల రాకకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఉన్నట్టుండి ఢంకా మ్రోగ సాగింది.............