బాల్యం నుంచి తరుణ దశలోకి..
అమ్మ నీడలో బాల్యం
తల్లి వెనకాల ఏడుస్తూ పరిగెడుతున్న ఆ చిన్నపిల్లాడు నన్ను వెంటాడుతుంటాడు. తండ్రి రూపం తెలియదు. అమ్మ మాత్రమే సర్వస్వం అనే భావంతో మిగతా ప్రపంచంలో అంతా అభద్రత అనే భయంలో ఆ బాలుడు చాలా కాలం అలా పరిగెడుతూనే వున్నాడు.
పల్లె నుంచి బతుకుదెరువు కోసం పట్నం వలస వచ్చిన అమ్మ తన ఆ వయస్సులో ఎన్నెన్ని అనుభవాలు పొందిందో, కష్టాలు చూసిందో ఆ కుర్రాడికి తెలుసు. సికింద్రాబాద్ మారేడ్పల్లి మిలిట్రి ఆఫీసర్ ఇంటిలో మొదలు వరుసగా బేగంబజార్ మార్వాడి ఇళ్ళల్లో పసిపిల్లలకు పాలిచ్చే కొలువు. ఇక తమలపాకులు అమ్ముతూ కోఠీ సుల్తాన్ బజార్లో అరుగుమీద కూర్చోడం ఇలా ఆ చిన్నాడి జీవితం యథార్థమనే వివిధ దృశ్యాలను చూసింది. దీనంగా నిస్సహాయంగా ఎటువెడుతున్నాడో తెలియని అయోమయం! తాత్కాలికంగా తిండి బట్ట కాసిన్ని చిల్లర డబ్బులు ఆపై చదువు ఉంటే చాలు అనే పెనుగులాటలో కొనసాగింది బాల్యమంతా!
ఆ బాలుడు ఎవరో కాదు నేనే!!
చదువురాని రైతు కుటుంబంలో పుట్టిన నేను, మా ఊరు వీరవల్లిలో పొలాలు, చెలిమలు, బావులు వెంట తిరిగాను. మా అమ్మమ్మ సోదరులుండే ముత్తిరెడ్డి గూడెంలో,....................