అరణి దర్పణం
శ్రీ.శ్రీ. వాక్కులమ్మకు శరణాగతి చెపుతూ ఒక మానవ ఇతిహాసం కోసము మాట్లాడుకుందామా? నేల పొరలను చీల్చుకొని విత్తనము రెండుముక్కలుగా పగిలి మొలకెత్తినట్లుగా ప్రకృతిమాత పొత్తిళ్లల్లో కవల శిశువులుగా ప్రాణి పుట్టుక, పాట పుట్టుక ! మనిషి నిప్పును కనుగొన్నాడనేది పచ్చి అబద్దం. ఆ.. మనిషే ఒక నిప్పుకణిక కదా! తన ఉనికి ఈ ధరాతలంపై మొలకెత్తకముందే పెనుగాలులు సంభవించినపుడు మహావృక్షరాజముల కొమ్మలు ఢీకొట్టుకున్న రాపిడిలో రాలిపడిన 'అరణి' కారుచిచ్చుగా మారి కీకారణ్యాలను కాల్చుకుతింటున్న కాలమది. కరువు రక్కసి కోరలు కన్నెర్రజేసి తరుముకొస్తున్న తరుణమది! వనసీమలకావల జనసీమలు అక్కడక్కడ అంకురిస్తున్నవేమో? ఎడారుల్లోకి పరుగెత్తిన రాకాసి బల్లులు, ఆకలిని తట్టుకోలేక కనిపించిన రాయినల్లా కరకరమని నమిలి తింటున్నప్పుడు, రాగాల రాశులు, రక్తాల ఊసులు..
ఉత్తుంగ తరంగాల్లా ఉరుములే మృదంగ ధ్వనులై దిగ్దిగంతాలను ముద్దాడుతున్నప్పుడు, తటిల్లతల తళత్తళలు తాళాలై మ్రోగుతున్నప్పుడు, గగనాంతరసీమ గానసమూహమై పాటనందుకుంటే, నేల రంగస్థలమై ఆటనందుకున్నది. ఆ ప్రకృతి పురుషులు కేళీవిలాసాల్లో తేలుతున్నవేళ... స-షడ్జమం నెమలి కూత నుండి, రి-ఋషభం వృషభం రంకె నుండి, గ-గాంధారం మేషం అరుపు నుండి, మ-మధ్యమం కొంగ అరుపు నుండి, ప-పంచమం కోయిల కూత నుండి, ద-ధ్వైతం అశ్వము సకిలింత నుండి, ని-నిషాదం ఏనుగు ఘీంకారం నుండి, స- మళ్ళీ పునరావృతమవుతుంది. ఈ సప్తస్వరాలను ఇటు కర్నాటక సంగీతం కానీ, అటు హిందూస్థానీ సంగీతం కానీ, ప్రపంచంలో ఏ సంగీతమైతేనేమి వీటి అన్వయింపులోనే కొనసాగుతుందనేది జగద్విదితం.
సప్తస్వరాలు అనబడే ఈ 'సరిగమపదనిస'లను మానవమేధ కనిపెట్టకముందే మాయమ్మ, తన నాలుకను తాళపత్రముగా జేసుకొని కంఠసీమను గంటంగా మార్చుకొని ప్రకృతిలోని అనేక శబ్ద ధాతువులను ఆస్వాదిస్తూ, అనుకరిస్తూ తన పెదాలను కదుపుతూ, తనకు తోచిన పదాలతో పాటను మొట్టమొదటగా కైగట్టిన ఆదికవి 'అమ్మ'. నేలను పాదుగజేసి, గాలిని పందిరిగా తలబోసి, నీటితో నిత్యం తలకుబోసి, నిప్పుతో నిలువెల్ల ఉద్దీపన చేసి, ఆకాశతత్త్వంతో లోకుల స్వరపేటికలను సరిజేసి తన ఉచ్ఛ్వాస నిశ్వాసగా, పుట్టింది మొదలు, తను గిట్టేంత వరకు ఆ పాటనే తన జీవనబాటగా మలచుకొని పాటను ప్రపంచ పటాన ఆవిష్కరించిన విశ్వ సంగీత శిఖరం అమ్మే కదా!.............