నిర్మాల్యం
“తాజ్మహాల్ సౌందర్యం చూసి 'అహెూ అద్భుత కట్టడం' అని మురిసిపోతాం. దానిని నిర్మించిన షాజహాన్ని తలచుకుంటాం. అతడికి భార్య ముంతాజ్ మీద గల అపార ప్రేమని గుర్తు చేసుకుని వేనోళ్లు అభినందిస్తాం.
మహాకవి శ్రీశ్రీ లాంటి కొద్ది మంది మాత్రమే తాజ్మహాల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, అత్యద్భుతంగా మలచిన శిల్పులు ఎవరు - అని ప్రశ్నించుకుంటారు. మహానగరంలోని ఈ ఆకాశ హర్శ్వాలు చూడండి. చిత్రవిచిత్ర ఆకృతుల్లో ఆకర్షణీయంగా ఉండటమేగాక విస్మయపరుస్తోన్న ఈ భవన సముదాయాల్ని చూడండి. రాజభవనాలను మించిన ఠీవితో, చక్కని ఎలివేషన్తో నగరానికే మణిహారంగా గర్వకారణంగా ఉన్న ఈ భవనాలను చూడండి.
వీటికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో మీకు తెలుసా?
ఇది ఈ పరిశ్రమలు - ముఖ్యంగా ప్రమాదకర రసాయనాల కర్మాగారాలు చూడండి. వీటి యంత్రాల కోరలు తోమే, చక్రాలు తిప్పే చేతులెవరివో మీకు తెలుసా? ఈ గనుల్ని తొలుస్తోంది, ఆ క్వారీల్లో బండల్ని బద్దలు గొడుతోంది, ఈ రాళ్లని ఛేదిస్తోంది. ఈ ఇటుకలను తయారు చేస్తోంది ఎవరో ఎవరో మీకు తెలుసా?
పనివారుగా తాపీ పనివారుగా గూర్ఖాలుగా కార్పెంటర్లుగా కొరియర్ బాయ్లుగా ఎలక్ట్రిసియన్లుగా సేల్స్మెన్లుగా టాక్సీడ్రైవర్లుగా ఫాల్స్ సీలింగ్, ఫ్లోరింగ్, కార్పెంటరీ నిపుణులుగా పని చేస్తూ నగరానికి అద్భుత శోభ తెస్తూ నగరాభివృద్ధికీ పారిశ్రామికోత్పత్తికీ తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికీ నిరంతరాయంగా శ్రమిస్తోన్న వీరిలో అత్యధికులు ఎక్కడివారో, ఎక్కడెక్కడనుంచి నగరానికి వచ్చారో మీకు తెలుసా?
మీ ఊహకి కూడా అందటం లేదు కదూ!
ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా - కాదు కాదు లక్షలాదిగా వలస వచ్చిన కార్మికులు - వలస పక్షులు!................