అభినందన
- డా|| మండలి బుద్ధప్రసాద్
మాజీ మంత్రివర్యులు, మాజీ ఉపసభాపతి,
ఆంధ్రప్రదేశ్
ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యం బలమైన స్వరంతో, సైద్ధాంతికతో విస్తరించిన ప్రముఖమైన శాఖ. దళితుల సమస్యల గురించి మొదట్లో దళితేతరులైన అగ్రవర్ణాల రచయితలే స్పందించి కవిత్వాన్ని రాశారు.... అందులో మంగిపూడి వేంకటశర్మగారిని అగ్రగణ్యుడుగా చెప్పుకోవచ్చు. తరువాత చాలామంది దళిత సోదరులు జాషువా మొదలైన వారు వేసిన దారిలో పయనించి, కలంపట్టి సాహిత్యాన్ని సృష్టించి కవులుగా, రచయితలుగా ఎదగడం మనం గమనించవచ్చు.
ఈ దళిత సాహిత్య శాఖ ఎన్నో ప్రక్రియలతో ప్రస్తుత కాలంలో పరిడవిల్లుతున్న విషయం మనకు విదితమే. దళిత స్పృహతో రచనలు చేస్తూ చాలామంది రచయితలుగా ఎదగడాన్ని కూడా గమనించవచ్చు. ఈ రకమైన స్పృహ కలిగించిన వారిలో ఆద్యులు శ్రీ మంగిపూడి వేంకటశర్మ. ఇక్కడ ఒక చారిత్రకాంశాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి, అదేమిటంటే అజ్ఞాతకర్తృత్వంగా మాలవాండ్ర పాట అనే పేరుతో ఒక గేయం వచ్చింది. అనంతరం అస్పృశ్యతను ఖండిస్తూ గాంధీ గారి కంటే ముందే 1915లో మంగిపూడి వెంకట శర్మగారు నిరుద్ధ భారతం అనే కావ్యాన్ని రాశారు. అనంతరం 1917, 1933 సంవత్సరాలలో రెండు, మూడవ ముద్రణలు పొంది, ప్రస్తుత పాఠకులకు అందుబాటులో లేని ఈ కావ్యాన్ని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లుగారు పరిష్కరించి పునర్ముద్రించి అందుబాటులోకి తీసుకురావడం ముదావహం. అందుకు ఆయన ఎంతైనా అభినందనీయులు.
ఎంతో ప్రయాసపడి, అర్థతాత్పర్యాలు సమకూర్చి చక్కని వివరణను ఆచార్య బూదాటి అందించారు. కవి గారి కాలంనాటి పరిస్థితులను మాత్రమే కాకుండా ఇటీవల జరిగిన దళిత అభ్యుదయ ఘటనలను కూడా ఆయన ఈ కావ్యంలో...................