తపస్సు
తాపసీ... నీ లోకాల్లోకి సన్నాహ్వానించు...
రికామీగా ఒక అశ్రుబిందువు జారిపోతోంది
రాత్రిని కాలమో, కాలాన్ని రాత్రో మింగేస్తోంది.
చాలా కాలమైంది, ఇంటి తలుపు చప్పుడు విని.
ఒక్కోసారి మేల్కోవాలంటే
కళ్లు మూసుకుని నెమ్మదిగా
నిశ్శబ్దాన్ని స్వప్నించాలేమో!
చెదలు పట్టిన పుస్తకం
ఇంకా ఆసరా ఇవ్వగలననే భరోసానిస్తోంది.
కంటికింది చారలు
ఒక్కోటీ ఒక్కో కథ చెబుతున్నాయి.
ఈ దుఃఖ సౌందర్యంలో, సౌందర్య దుఃఖంలో
తనివితీరా స్నానించనీ!
ఈ క్షణంలోనే మెరుస్తూ
ఈ క్షణాన్నే జీవిస్తూ, ఈ క్షణాన్నే ఆస్వాదిస్తూ,
గతంలోంచి చిట్లిపోతూ, గతం నుండి చెరిగిపోతూ,
గతించిన జ్ఞాపకాల బరువుని త్యజించనీ!.........................