రాజా నరసింహ తన నియాం పురం నవల ద్వారా జీవితాన్నీ, వారి పోరాటాన్నీ ఒక సరికొత్త ప్రాసంగికతతో మనముందు చూపిస్తున్నాడు. గోపీనాథ మొహంతి నవల “అమృత సంతానం” లానే ఈ నవల కూడా గిరిజన జీవితాన్ని ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించడానికి ప్రయత్నించింది. పుట్టుక, పెళ్ళి, చావు, పూజ, బలి, వియ్యం, కయ్యం - ఒక సమాజాన్ని చిత్రించడానికి అవసరమైన ఏ ఒక్క పార్శ్వాన్నీ రచయిత విడిచిపెట్టలేదు. గిరిజన జీవితంలో ఏడాది పొడుగునా నడిచే క్రతుకాండ, సంబరాలు, ఉత్సాహం, వేడుకలు వేటినీ రచయిత వదల్లేదు. సంతలు, దోపిడీ, వడ్డీ, వెట్టి, అణచివేత, తిరుగుబాటు- గిరిజన జీవితాన్ని ప్రతిబింబించే ఏ సందర్భాన్నీ రచయిత పక్కన పెట్టలేదు. చివరికి తాను కళ్ళతో చూసినదాన్ని పూర్తిగా తిరగమార్చి తప్పుడు కథనాలు రాసి పంపించే విలేకరితో సహా గిరిజన ప్రాంతంలో మనకి కనబడేవాడేవడూ ఇందులో కనబడకుండాపోడు.
అలాగని ఈ నవలను అమృతసంతానానికి అనుకరణగా చెప్పలేను. అమృతసంతానం ఎక్కడ ఆగిపోయిందో ఈ నవల అక్కడ మొదలవుతున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ నవలని 21వ శతాబ్దపు అమృత సంతానంగా అభివర్ణించవచ్చు. నియాం పురం నవలని రెండు చేతులూ చాచిమరీ స్వాగతిస్తున్నాను........................