సంపాదకీయం
శ్రీయుత ఉన్నవ లక్ష్మీనారాయణ గారి 'మాలపల్లి'
తెలుగు సాహిత్యము మానవధర్మ పరిణామమునకు
సాధనము గాగల విధమును హృద్యముగ నిరూపించుచున్నది.
ఆంధ్ర సాహిత్య పరిణామమునందు 'మాలపల్లి'
నిరుపమానమైన గ్రంథము
(కాశీనాథుని నాగేశ్వరరావు : ఈ గ్రంథంలో : పు 6)
ఉన్నవ లక్ష్మీనారాయణగారి 'మాలపల్లి' నవల శతజయంతి (1922-2022) సందర్భంగా ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదక వర్గం ఆ నవల మీద వచ్చిన విమర్శ వ్యాసాలను సేకరించి సంకలనం చేసి ఇప్పటి పాఠకులకు అందించాలని సంకల్పించింది. ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రిగారు, ఆచార్య కె. కాత్యాయని విద్మహే గారు రచించిన ఐదు వ్యాసాలను ఒక పుస్తకంగా సంకలనం చేశాం. మరో పద్నాలుగు మంది రాసిన పదహైదు వ్యాసాలను ఒక సంకలనంగా తీసుకొచ్చాం. ఈ సంకలనంలోని చివరి మూడు వ్యాసాలు 2022లో రాయబడినవి. తక్కిన పన్నెండు వ్యాసాలు 1935 - 1986 మధ్య ప్రచురించబడినవి. మొత్తం మీద 1935-2022 మధ్య 87 ఏళ్ళ కాలంలో 'మాలపల్లి' నవలను తెలుగు సాహిత్య విమర్శకులు అర్థం చేసుకున్న తీరుకు ఈ గ్రంథం నిదర్శనంగా నిలుస్తున్నది.
1935లో కాశీనాథుని నాగేశ్వరరావుగారు 'మాలపల్లి' నవలను సమగ్రంగా ప్రచురిస్తూ రాసిన తొలిపలుకు, తర్వాతి కాలంలో ఆ నవలను అధ్యయనం చేసేవారికి దారి చూపింది. ఆయన భాష గ్రాంథికంలో ఉంటూ నేటి పాఠకులకు చదవడం ఇబ్బంది అనిపించినా, సంప్రదాయ చింతన కనిపించినా, దానిని చదవాలి. చదివితే...................