అష్టోత్తర శత వ్యాససంచిక
29
ఎన్.టి.ఆర్ ఉపన్యాసాలు
-(కీ.శే) నందమూరి తారక రామారావు
ఈ మహాపర్వదినాన కైంకర్యమైన మనస్సుతో స్వామిని మనసులో అహర్నిశలు ధ్యానించుకుంటూ నలుమూలలనుండి విచ్చేసిన భక్తవరేణ్యులకు,
పూజ్యులకు, పెద్దలకు, సోదరీసోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మతం అన్నది ఈనాటిది కాదు. ఎప్పుడో మానవుడు పుట్టినప్పుడే మనస్సులో మెదిలినటువంటి పవిత్రభావము మతము. నాకన్నా శక్తి ఈ ప్రపంచంలో ఏమున్నదో దానిని నేను ఆరాధిస్తాను. అదే నా మతము అనేటటువంటి రోజులివి. ఎన్నో యుగాల క్రితం సృష్టి తర్వాత మానవుడు మానవుడిగా పరిగణించబడటానికి పరిపూర్ణమైన ఆకృతిని రూపొందించటానికి నీతిదాయకమైన సామాజికపరమైన సంస్కారాత్మకమైన జ్ఞానం అతని మనస్సులో ఉద్భవించడానికి ఎన్నో యుగాలు గడిచాయి. కాబట్టి ఏ మతాన్ని మనం ఆరాధించాలి అనేది మన విజ్ఞానానికి స్ఫూర్తిగా అనుగుణంగా మనం నిర్ణయించుకోవాల్సిన విషయం. ఏ భగవంతుడూ మతాన్ని గురించి చెప్పలేదు. కేవలం శిష్టరక్షణ, దుష్టశిక్షణకోసం 'సంభవామి యుగే యుగే'-అని "ఏ యుగములోనైనా సరే అధర్మం ఎప్పుడైతే పెచ్చుపెరిగిపోతుందో, అన్యాయం ఎప్పుడైతే మితిమీరుతుందో, దుర్మార్గం ఎప్పుడైతే అన్నిటికంటే సర్వవ్యాప్తంగా వస్తుందో, అప్పుడే ఆ దుష్టులను శిక్షించటానికి, శిష్టులను రక్షించటానికి నేను అవతారాన్ని ఎత్తుతాను" అని చెప్పాడు గీతావాక్యాలుగా ఆదిస్వరూపుడైన పరమాత్మ.
ఆనాడు శ్రీరామచంద్రమూర్తి బోధించిన సత్యాలు 'మానవులలో మానవులకు భేదాలు లేవు. సర్వసమాజం ఒక్కటే, భేదాలు లేనటువంటి సమానమైనటువంటి సమాజం కావాలి మనది' అని. తనకు నల్గురు అన్నదమ్ములు పుట్టారు, కాని ఆయన ఏమన్నాడు గుహుడ్ని చూసినపుడు 'నాయనా గుహా! నీతో మేము ఐదుగురము సోదరులము' అన్నారు ఆయన. అదే విధంగా సుగ్రీవుడిని చూసినపుడు- 'నాయనా సుగ్రీవా! నీ విరహమేమిటో నాకు తెలుసు. నీకు జరిగిన అన్యాయమేమిటో నాకు తెలుసు. ఆ దుర్మార్గాన్ని నేను ఖండిస్తాను. మేము ఇప్పటికి ఐదుగురు సోదరులం అయినాము. ఈనాటితో ఆరుగురం కాబోతున్నాము' అన్నారు ఆ మహానుభావుడు. అదే విధంగా విభీషణున్ని చూసినపుడు 'నీ' సోదరుడు నీమీద ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో, నాకు తెలుసు. కాబట్టి నీకు సరియైన ధర్మరక్షణ కలిగిస్తాను. నీతో మేము ఏడుగురం సోదరులం' అన్నారు ఆయన. ఒకాయన జ్ఞాని, ఒకాయనేమో వన్యజాతిలో ఉన్నటువంటి ఒక మర్కట స్వరూపుడు సుగ్రీవుడు. అట్టడుగున ఉన్నటువంటి బడుగువర్గాల ప్రతినిధి ఒక పల్లెకారు. మరి వీరందరిని కూడా సోదర భావంతో తమతో చేరదీసుకున్నాడంటే, ఆయన స్వరూపం ఏమి చెప్పింది. సమాజంలో ఏమయినా భేదాలు ఉన్నాయని చెప్పిందా? మీరే ఆలోచించండి...............