మొదటి భాగం
సినిమాల్లో పురాణ పురుషుడుగా కీర్తింపబడి, రాజకీయాల్లో మకిలి అంటని ప్రజా నాయకుడుగా ప్రసిద్ధిచెందిన తెలుగుతేజం యన్టిఆర్ తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి దశాబ్దాలు గడిచినా ఆయన రూపం ప్రజల మనోఫలకం పై చెరిగిపోలేదు. వివిధ మాధ్యమాల్లో ఆయన రూపం కనిపిస్తూనే ఉంది, వాడవాడలా ఆయన గళంవినిపిస్తూనే ఉంది. ధైర్యం, పట్టుదల, నిరంతర పరిశ్రమ ఆయనను ముందుకు నడిపించాయి. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం ఆయన చిత్తశుద్ధిగా పాటుపడ్డారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, అభ్యున్నతికి ఆయన ప్రతీకగా నిలిచారు. ఆయన వెలిగించిన దారిదీపాలు ధగధగలాడుతూ కళాకారులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి.
తెలుగు ప్రజల చరిత్రను సుసంపన్నం చేసిన ఆ మహనీయుడు విజయవాడకు 48 కిలోమీటర్ల దూరంలో దాదాపు 500 గడపలున్న నిమ్మకూరు పల్లెటూరులో 1923 మే 28వ తేదీ జన్మించారు. కానీ యన్టిఆర్ కథ నిమ్మకూరులో కాకుండా పొట్టిపాడు గ్రామంలో శ్రీకారం చుట్టుకుంటుంది. పొట్టిపాడులో కాట్రగడ్డ సూరయ్యకు ఇద్దరు కూతుళ్లు : చంద్రమ్మ, వెంకటరావమ్మ. పొట్టిపాడులో సూరయ్య పొలాల్లో పంట దిగుబడి అంతంత మాత్రమే. శ్రమకు తగ్గ ఫలం అందకపోవడం వల్ల, తమ పొలాల్ని అమ్మేసి, తట్టాబుట్టా సర్దుకుని సూరయ్య కుటుంబం పక్కనే ఉన్న కొమరవోలుకు వలస వెళ్ళింది.
నందమూరు రామయ్య నిమ్మకూరు నివాసి. ఆయనకు నాటకాలంటే మక్కువ. పల్చటి తెల్లటి లాల్చి, మల్లు పంచె, అప్పుడప్పుడూ పైన కోటు ఆయన ఆహార్యం. ఆ కోటుజేబులో గొలుసు గడియారం. అత్తరు పన్నీరులు ఆయన శరీరాన్ని గుబాళించేవి. జులపాల జుట్టు గిరజాలు తిరిగి భుజాలమీద నుంచి కిందికి వేలాడుతూ ఉండేది. కాళ్లకి కిర్రుచెప్పులు. కిర్రుజోళ్ళ చప్పుడు రామయ్య వీధిలో వెళ్తున్నట్లు తెలిపేది. అప్పుడు పిల్లలూ పెద్దలూ ఆయన్ని చూడ్డానికి ఇళ్లలో నుంచి కుతూహలంతో బయటకు వచ్చేవారు. అందరికీ ఆయన 'షోకు రామయ్య'. ఆయనకు వ్యవసాయంపై అభిరుచి లేదు. నాటకాలు చూస్తూ, నాటకాల్లో వేషాలేస్తూ, భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ, సరదాగా ఉండేవారు.
ఒక రోజు పాండవోద్యోగ విజయాలు అనే పౌరాణిక నాటకం నిమ్మకూరులో వేస్తున్నారు. అందులో కీలకమైన భీముని పాత్రధారి షోకు రామయ్య. ఏదో పనిమీద........................