అధ్యాయం - 1
చారిత్రక ప్రయాణం
హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం చాలా చారిత్రక సన్నివేశాలకు సాక్షీభూతంగా నిలిచింది. లోగడ అక్కడ సైన్యం విడిది చేసేది. క్రికెట్ ఆడేవారు. అక్కడే 1950లో క్రికెట్ స్టేడియం నిర్మించారు. అక్కడ హైదరాబాద్ నగర నిర్మాత కులీకుతుబ్ షా ఒక అందమైన తోట (బాగ్-ఇ-దిల్ ఖుషా) నిర్మించాడు. ఔరంగజేబు చక్రవర్తి గోలకొండపైన దండెత్తినప్పుడు మొఘల్ సైన్యం మకాం ఉండేందుకు ఆ తోటలో చెట్లను తొలగించి చదును చేశారు. మొఘలులు 1687లో గోల్కొండను స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ తోటను ఫతేమైదాన్ (విజయభూమి) అని పిలవడం ప్రారంభించారు.
అటు తర్వాత పాతనగరంలోని పురానాపూల్ కిందుగా చాలా నీరు ప్రవహించింది. హైదరాబాదీలకు ఫతేమైదాన్ ఒక ఆకుపచ్చని మైదానంగా మిగిలింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేసేందుకు 1948లో జనరల్ జె.ఎన్. చౌథురి సైనిక ప్రభుత్వాధినేతగా తొలి బహిరంగసభను ఉద్దేశించి అక్కడ ప్రసంగించారు. ఆ మైదానంలోనే హైదరాబాద్లో తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 1955లో జరిగింది.
భారత, పాకిస్తాన్ల మధ్య 1965లో యుద్ధం జరిగినప్పుడు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ రక్షణ నిధికి విరాళాలు సేకరించే ఉద్దేశంతో దేశవ్యాప్త పర్యటనలో భాగంగా హైదరాబాద్ సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 1.25 లక్షల గ్రాముల బంగారం రక్షణ నిధికి విరాళంగా ఇచ్చింది.....................