సౌందర్య తత్వం
ప్రకృతిలో గొప్ప సౌందర్యం ఉంది. పువ్వుల అందం, చందమామ అందం, జలపాతాల అందం, రకరకాల జీవుల శరీరాకృతులలోని సౌష్ఠవం... ఒక గుర్రం నిర్మాణం, ఒక పిట్ట పొందిక, ఒక పాము స్నిగ్ధత, మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. పసిజీవి అయితే అది ఏ జాతిది అయినా మనల్ని పరవశుల్ని చేస్తుంది.
ప్రకృతి సౌందర్యంలో ఎంతో వైవిధ్యం ఉంది. అందం అంటే కంటికి కనిపించేది మాత్రమే కాదు. సపోటా అందం దాని రుచి. సంపెంగ అందం దాని పరిమళం. నెమలి అందం దాని వర్ణ సమ్మేళనం. కోకిల అందం దాని స్వరం.
ప్రకృతిలో సౌందర్యం మాత్రమే కాదు, సౌందర్య తృష్ణ కూడా ఉంది. ఎవరి దాహమో తీర్చడానికి కాకపోతే ఇంత అందం ఎందుకున్నట్టు?
లోతుగా ఆలోచిస్తే అర్థం అవుతుంది - అందం వట్టి ఆనందంకోసం మాత్రమే కాదు. అందం ఒక పిలుపు. ఐక్యతకోసం, తాదాత్మ్యం కోసం... అందం మనోహరంగా సమ్మోహకంగా పిలిచి జీవుల్ని ఏకం చేస్తుంది.
మనిషి సౌందర్య దృష్టి విచిత్రమైంది. ఇతర జీవుల్లా ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండిపోడు. ప్రయత్నించి అందంగా తయారవుతాడు. అందం కోసం ఎంత తపన పడతాడో. ఎన్నో మేకప్పులు ఆపాదమస్తకమూను. పైగా మనిషికి తను అందంగా ఉంటే చాలదు. తన వస్తువులుకూడా అందంగా ఉండాలంటాడు. వస్తువు ఉపయోగపడితే చాలదా అని తృప్తి పడలేడు...............