శివస్వామి మెట్రో రైలు కిటికీలోంచి బయటికి చూశారు. రోడ్లు, సిగ్నల్ లైట్లు, కిక్కిరిసిన వాహనాలు, కంగారుగా రోడ్డు దాటుతున్న జనసమూహం, ఎత్తైన భవనాలు, దుకాణాలు, ఇళ్లు, డాబాలపై రంగు వెలసిపోయిన సింథటిక్ ట్యాంకులు, రంగురంగుల బిల్ బోర్డులు, పచ్చని చెట్లు, కుంకుమ రంగు గుల్మెహర్ పువ్వులు, మొబైల్ టవర్లు, లైట్ స్తంభాలు-అన్నీ కళ్లను చెదరగొట్టే వెలుతురుకు తమ ఉనికికన్నా నిశ్చలంగా, ప్రకాశవంతంగా కనిపించాయి. రైలు ఆగి ఎం.జి. రోడ్డు మెట్రో స్టేషన్లో దిగే సమయానికి సూర్యుడు నడినెత్తి మీద కనికరం లేకుండా మండిపడుతున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత వెతికి వేసుకున్న నల్లటి బ్లేజర్ శరీరాన్ని లోపల ఉడికించి, బనియన్, చొక్కా శరీరానికి అంటుకునేలా చేసింది. ట్రైన్లో జనాల రద్దీ మధ్య నిలబడి చేసిన ప్రయాణం, దిగిన తర్వాత మండే ఎండలో ఆఫీస్ వెతుక్కుంటూ తిరగటం అంతా కలిసి ఆఫీసు చేరేసరికి ఆయాసంతో కాళ్లు నొప్పెట్టసాగాయి.
తాను వెతుకుతున్న కంపెనీకి చేరుకుని లాబీలోని సోఫాలో కూర్చుని ఏసీ చల్లని గాలిలో నుదుటిపైని చెమటను తుడుచుకున్నారు. అతని చెంపలు, ముక్కు నుంచి జారిన చెమట చుక్కలు అతని నలుపు-తెలుపు గరుకు మీసాలను తడిపి పెదవుల మీదికి జారుతున్నాయి. జేబులోంచి తీసిన కర్చీఫ్ నుంచి.....................