నన్ను పట్టి పీడించే ఒక జీవితకాలపు వేదన ఈ నవల. డోజర్లతో పొదలన్నిటినీ కుళ్ళగించి, బరకల్నీ, బీడు నేలల్నీ సాగుభూములుగా మార్చే క్రమంలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న దుర్మార్గం ఒకవైపు పల్లెల్ని కమ్ముకొస్తూ ఉంటే, మరోవైపు పాతకాలపు వృక్షాల ఫలసాయంతో తృప్తిపడాల్సింది పోయి, ఆ చెట్లనే నరికి సొమ్ము చేసుకోవాలని చూసే మూర్ఖత్వం, స్వార్థం చుట్టుముడుతూ ఉంటే, ఇంకోవైపు బహుళజాతి కంపెనీల వంగడాలతో సాంప్రదాయక విత్తనాలు, తృణధాన్యాలను మట్టిలో పాతిపెట్టే అత్యాశ ఒక దయ్యంలా వెంటాడుతోంటే పల్లె తన స్వరూపం కోల్పోతున్న పరిస్థితి నా హయాంలోనే చూస్తూ ఉన్నాను.
ఈ విధ్వంసదృశ్యాలన్నిటికీ సాక్షీభూతంగా నిలుచున్న దయనీయ స్థితిలోంచి ఈ నవల పుట్టింది. పర్యావరణాన్ని మాత్రమే కాదు, తన్ను తానూ కాల్చి బూడిద చేసుకునే దిశగా మనిషి గమనం చూస్తున్నాను కాబట్టే ఈ నవల రాయాల్సి వచ్చింది. రోడ్డుకు దూరంగా, మారుమూల పల్లెల్లో బతుకుతూ ఉన్న పాతకాలపు వ్యవసాయదారుల జీవన మూలాల్ని అంటుగట్టి తెచ్చి, నగరీకరణ దిశగా అడుగులేస్తోన్న పల్లెవీధి కూడళ్లలో నాటగలిగితే ఈ రోగానికి కొంతైనా ఉపశమనపు మందు తయారవుతుందేమోనన్న ఆశతో ఈ నవల రాశాను.
మాయమవుతున్న పల్లె జీవితం పై పట్టణ ప్రభావం నేపధ్యంతో సాగిన నవల ఇది. ఇందులో రెండు భాగాలున్నాయి. ఒకటి పేరు ప్రఖ్యాతలు గడించిన ఒక డాక్టర్ అంతరించిపోతున్న ధాన్యపు జాతి కోసం ఆరు నెలల అన్వేషణ. రెండవది తన ప్రాణవాయువుతో పొలాన్ని బుజ్జగించి, సమస్త జీవకోటితో అత్యంత సహజంగా మమేకమైపోయిన మరో అంతరిస్తున్న జాతి - రైతు జీవితం.
- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి