పోలీస్ ఇన్నోవా సర్రున వచ్చి 'మౌంట్ ఒపేరా,' ఆర్చి క్రిందికి, ఎడమవైపు తిరిగి, రెండొందల గజాల ముందుకు వెళ్లి ఆగింది. దానిమీద 'రాచకొండ పోలీస్ కమీషనరేట్, హయత్నగర్ పోలీస్,' అని ఉంది. ముందు సీట్లో కూర్చున్న హయత్ నగర్ సి.ఐ పర్వత రెడ్డి దిగాడు. వెనుక నుంచి, యస్.ఐ. నలుగురు పోలీసులు
దిగారు.
అప్పటికే అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. పోలీసులను చూసి వెనక్కు తగ్గారు. ఇద్దరు పోలీసులు 'క్రైంసీన్, డోన్ట్ క్రాస్,' అని వరుసగా రాసి ఉన్న మూడంగుళాలు వెడల్పున్న రిబ్బన్ల లాంటి వాటిని క్రైంసీన్ చుట్టూ, తమతో తెచ్చి ప్లాస్టిక్ పైపులు పాతి వాటికి కట్టారు.
రోడ్డు కొంచెం ఎత్తుగా ఉంది. పక్కన దుబ్బుగా పెరిగిన పిచ్చి మొక్కలున్నాయి. ఒక కలబంద మొక్క ఏపుగా పెరిగి ఉంది. రెండు మూడు తంగేడు చెట్లు, రోడ్డు అంచున ఒక దిరిసెన చెట్టు పెద్దది ఉంది. దాని కొమ్మలనిండా పూలు విరగ కాసి ఉన్నాయి.
కలబందలకు, తంగేళ్లకు మధ్యన పడి ఉందొక శవం. ఇంకా దుర్వాసన రావటం లేదు. సి.ఐ. పర్వత రెడ్డి దిగి, కట్టిన రిబ్బన్ క్రింది నుంచి దూరి శవం దగ్గరకు వెళ్లాడు. శవం ఒకవైపుకు తిరిగి ఉంది. మగవాడే. జీన్స్ పాంటు, గోధుమరంగు చెక్స్ ఉన్న షర్ట్ ధరించాడు. షర్టు వెనక కాలర్ క్రింద 'రామాజ్ కాటన్,' అన్న బ్రాండ్ కనబడుతూంది. కాళ్లకు 'రెడ్ ఛీఫ్' కంపెనీవి బూడిదరంగు కవాడిస్ షూస్ ధరించి ఉన్నాడు. అరవై ఏండ్లు ఉండొచ్చు. హెయిరై వల్ల యంగ్ గా అనిపిస్తున్నాడు.
వెనక మరో వాహనంలో, ఫోరెన్సిక్ నిపుణుడు, పోలీస్ ఫోటోగ్రాఫర్ వచ్చి చేరుకున్నారు. సి.ఐ. చెప్పినమీదట యస్.ఐ. ఒక కర్రతో శవాన్ని వెల్లకిల్లా తిప్పాడు. శరీరంమీద ఏ గాయాలు లేవు. డ్రస్ మీద రక్తం మరకలు కూడా లేవు. కాని మెడమీద.............