పి.వి. నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నతమైన సేవలు అందించారు. ఆయన జీవిత విశేషాలలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉన్నాయి. వెనుకబడిన ఒక కుగ్రామంలో జన్మించి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయిన వైనం గమనిస్తే ఈ తరం వారికే కాదు ముందు తరాలవారికి కూడా ఎంతో ఆదర్శప్రాయం. ఆయన జీవితంలో సంభవించిన ప్రతీ ఘట్టం చారిత్రక విషయమే. వారు వీరు అనే భేదం లేకుండా ఎవరైనా ఆయన జీవిత చరిత్రను చదివి ఆయా విషయాలను అనుసరించవచ్చు. సమస్యలను ఎదుర్కొనడంలో, వాటిని సాధించడంలో, ప్రతికూల అంశాలను కూడా అనుకూలంగా ఎలా మార్చుకోవాలో, జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలో, అవకాశం వచ్చినప్పుడు అనుకున్నవి ఎలా సాధించాలో చక్కగా మనకు బోధిస్తుంది. ఆయన జీవితం.
పి.వి. నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన సంవత్సరం 1991 అప్పటికి నా వయస్సు 16 ఏళ్లు. రాజకీయాలన్నా, రాజకీయ చర్చలన్నా చాలా ఆసక్తి వుండేది. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఒక తెలుగు వ్యక్తి తొలిసారిగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించడం నాకు ఆనందాన్నిచ్చింది. అప్పట్లో నాకు ప్రభుత్వ పాలనా వ్యవహారాల పై అంతగా అవగాహన లేకపోయినా నలుగురు పెద్ద వాళ్లు కలుసుకున్నప్పుడు పి.వి. నరసింహారావు గారు చేస్తున్న మంచి పనుల గురించి మాట్లాడుకునేవారు. ఆ మాటలు విన్న నాకు తెలియకుండానే ఆయన పై అభిమానం ఏర్పడింది. తర్వాత కాలంలో పి.వి. నరసింహారావు గారి ప్రధాన మంత్రి పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు, ఆయనపై పెట్టిన కేసుల గురించి పత్రికలలో చదివి చాలా బాధపడ్డాను. 2004లో ఆయన చనిపోవడానికి ముందు ఆంధ్ర విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాలులో ఏర్పాటు చేసిన ఒక పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చారు. మొదటి సారి, చివరిసారిగా కూడా