పాలమీగడ
అప్పుడు టైమ్ రాత్రి ఒంటిగంట దాటింది. సెకండ్ షో సినిమా వదిలినట్టున్నారు. పుట్టలోంచి చెదపురుగులు బయటకు వస్తున్నట్టు జనం ఒక్కొక్కరే థియేటర్లోంచి వస్తున్నారు. నగరంలో లైట్లు బారుల్లా కన్పిస్తున్నాయి. చలికి తట్టుకోలేక శాలువా కప్పుకున్నట్టు అంగళ్ళకున్న షట్టర్లు రంగుల్లో కనిపిస్తున్నాయి.
పిరికి సైనికుడు శత్రు సైనికులకు దొరక్కుండా పొదల మాటున నక్కినట్టు, ప్లాస్టిక్ చెత్తకుప్ప డబ్బాలు అక్కడక్కడా కనపడీ కనపడనట్టున్నాయి. అతను అప్పుడే వైనాప్ నుంచి బయట పడ్డాడు.
షాప్ కట్టేసినా అయిదు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే క్వార్టర్ బాటిల్ బ్రాందీ దొరికింది. దానిమీద వున్న లేబుల్మీద బ్రాందీ అని వున్నా రంగు మాత్రం విస్కీలా ఉంది. రుచి రమ్ అనిపించింది. ఏదైతేనేం కిక్ వస్తే బావుండు అనుకున్నాడతను. ఈమధ్యకాలంలో అతను మందుకు అలవాటుపడ్డాడు.