ఐసిసియు
సైఫైతో బాటు క్రైమ్ కూడా కలిసిన నవల యిది. అందునా మెడికల్ క్రైమ్. రాసినది వృత్తిరీత్యా డాక్టరైన డా. చిత్తర్వు మధు. ఆయన మెడికల్ సైఫైయే కాదు, రకరకాల సైఫై నవలలు రాశారు. ప్రస్తుతం నేను పరిచయం చేస్తున్నది 1992లో ఆంధ్రప్రభ వీక్లీలో సీరియల్గా వచ్చి దరిమిలా పుస్తకంగా వచ్చింది. వాస్తవ పరిస్థితిని కాస్త ఎక్స్టెండ్ చేసి, ఓ చిన్న వూహ చేసి నవల రాశారు. అంతా గుండెజబ్బుల గురించి వుంటుంది. ఓ గుండెజబ్బుల హాస్పటల్లో చేరిన ఓ మంచి డాక్టరు, అతని పేరు రవికాంత్, హాస్పటల్లో జరుగుతున్న ఓ క్రైమ్న కనుగొంటాడు. దానిపై పరిశోధన చేస్తూ పోతాడు. క్రమక్రమంగా పొరలు విడిపోతూ వస్తాయి. విలన్ చేస్తున్నదేమిటో మనకు అర్థమవుతుంది. ఒక్కో పొరా విడిపోతున్న కొద్దీ మనకు ఎక్సయిటింగ్గా అనిపిస్తుంది. అదీ రచయిత రచనా కౌశలం. అయితే నేను నవల నడిచే తీరులో కాకుండా సస్పెన్సును ముందే చెప్పేస్తాను. అది మంచి డాక్టర్ ఎలా బయటపెట్టగలిగాడో తర్వాత చెప్తాను. సైంటిఫిక్ నవలలు మనకు అలవాటు లేదు కాబట్టి యి పద్ధతి అవలంబించకపోతే గుర్తు పెట్టుకోవడం కష్టం.
నవల పేరు ఐసిసియు. అంటే ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యునిట్ అని అర్థం. ప్రత్యేక శ్రద్ధ అవసరమైన కేసుల్ని ఐసియు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెడతారని మనకు తెలుసు. మనల్ని అక్కడికి వెళ్లనియ్యరు. ఎమర్జన్సీ తగ్గాకనే వార్డుకి మారుస్తారు. అదే గుండెజబ్బు కేసులయితే ఐసిసియు, అంటే కార్డియాక్ కేర్ అన్నమాట, అక్కడ పెడతారు. నవల అంతా గుండె జబ్బుల చుట్టూనే తిరుగుతుంది కాబట్టి, ఐసిసియును అడ్డు పెట్టుకునే విలన్ ఘోరాలు చేస్తాడు కాబట్టి నవలకు ఆ పేరు పెట్టారు.
ఈ నవలలో విలన్ డాక్టర్ నారాయణరావు అనే అతను నిరుపేద. కానీ చాలా తెలివైనవాడు. కష్టపడి వారాలు చేసుకుని పైకి వచ్చాడు. స్కాలర్షిప్పుల మీద చదువుకునిడాక్టరయ్యాడు. కానీ ప్రాక్టీసు లేదు. పైసాగడించలేదు. తలిదండ్రులను సుఖపెట్ట లేకపోయాడు. వాళ్లు పోయారు. ఇతను పెళ్లి చేసుకోలేదు. రిసెర్చి చేయాలన్న కోరిక. దానికి నిధులు కావాలి. పట్టుదలతో గల్ఫ్ వెళ్లి అక్కడ ప్రాక్టీసు చేసి పదిలక్షలు సంపాదించాడు..............